IPL 2024 Rohith Sharma :ఐపీఎల్లో ముంబయికి ఐదు టైటిళ్లు అందించిన ఘనత కెప్టెన్ రోహిత్ శర్మది. కానీ అతడిని పక్కకు పెట్టి హార్దిక్ పాండ్యకు ఈ సీజన్లో నాయకత్వ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. అయితే హార్దిక్ కెప్టెన్సీలో ముంబయి విఫలమైంది. వరుస పరాజయాలతో ముందుకెళ్తోంది. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ అయిన రోహిత్‌ను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ల జాబితాలో చేర్చింది యాజమాన్యం.
అందులోనూ లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ (11) క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. కేవలం ఒక్క సిక్స్ మాత్రమే బాది కుదురుకున్నట్లే కనిపించినప్పటికీ ఎక్కువసేపు ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ ప్లేయింగ్ 11లో మైదానంలోకి దిగిన హిట్ మ్యాన్ కోల్‌కతాతో పోరులో రాకపోవడంతో అతడికి ఏమైందనే అనుమానం అందరిలో నెలకొంది. అసలే ఐపీఎల్ పూర్తైన తర్వాత అతడు టీ20 వరల్డ్ కప్ కూడా ఆడాల్సి ఉంది. దీంతో ఈ విషయంపై ముంబయి సీనియర్ ప్లేయర్ పీయూశ్ చావ్లా స్పందించాడు. రోహిత్ ఇంపాక్ట్ రోల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.