IPL 2024 Sikhar Dhawan : ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ సూపర్ ఫామ్‌లోకి వచ్చేశాడు. తాజాగా డీవై పాటిల్ టీ20 టోర్న్‌మెంట్‌లో అతడు చెలరేగి ఆడాడు. డీవై పాటిల్ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇలా రెచ్చిపోయి ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గబ్బర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధావన్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గబ్బర్ ఇదే భీకర్ ఫామ్‌ను కొనసాగిస్తే ప్రత్యర్థి జట్టుకు హడలే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ధావన్ ప్రదర్శన వల్ల ఫలితంగా డీవై పాటిల్ బ్లూ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులను సాధించింది. ఇకపోతే ఈ జట్టులో ధావన్ మినహా ఇతర బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేకపోయారు. ఓపెనర్ అభిజిత్ తోమర్ (20 బంతుల్లో 31 పరుగులు), అయాజ్ ఖాన్ (9 బంతుల్లో 16), పరిక్షిత్ (6 బంతుల్లో 11 నాటౌట్) నామామాత్రంగా ఆడారు. సీఏజీ బౌలర్లలో సన్వీర్ సింగ్, రిత్విక్ చటర్జీ చెరో రెండు వికెట్లు తీయగా, ప్రధాన్, అంకిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.