IPL 2024 Robin Uthappa : ఐపీఎల్ 2024 చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ మొదలు కానుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్‌పై, ఐపీఎల్‌పై భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. మే 16న జియోసినిమాతో ఉతప్ప మాట్లాడుతూ, యంగ్ ప్లేయర్‌లకు అవకాశం ఇవ్వడానికి, సీనియర్ ప్లేయర్‌లు తప్పుకుని ఉండాల్సిందని చెప్పాడు.
- ఎందుకు తీసుకున్నారు వారిని?
"ఇలా మాట్లాడుతున్నందుకు చాలా విమర్శలు ఎదుర్కోవచ్చు. అందుకు సిద్ధంగా ఉన్నాను. గత వరల్డ్ కప్ తర్వాత సీనియర్‌లు తప్పుకుని ఉండాలి. యంగ్ ప్లేయర్‌లు 2024 వరల్డ్ కప్ అడే అవకాశం ఇవ్వాల్సింది. చాలా మంది యువకులు ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నారు. వారిలో గిల్ లాంటి వాళ్లను వరల్డ్ కప్‌కు ఎంపిక చేసుండాలి" అని పేర్కొన్నాడు. గిల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 12 మ్యాచుల్లో దాదాపు 39 యావరేజ్‌తో 147.40 స్ట్రైక్ రేటుతో 426 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన లిస్టులో 11వ పొజిషన్‌లో ఉన్నాడు.
2008లో టీ20 కప్పు గెలిచిన భారత్ తర్వాతి 7 ఎడిషన్లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. 2022 టీ20 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్లో ఇండియా ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్‌లు టీ20 ఫార్మాట్‌కు దాదాపుగా దూరమయ్యారు. ఏడాది తర్వాత 2024 ప్రారంభంలో ఆఫ్ఘానిస్తాన్‌తో సిరీస్‌కు తిరిగొచ్చారు. రవీంద్ర జడేజా కూడా 2023లో కేవలం రెండు టీ20లు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ ఈ ముగ్గురు సీనియర్‌లు 2024 వరల్డ్ కప్ 15 మంది సభ్యుల స్క్వాడ్‌కు సెలక్ట్ అయ్యారు. రింకు సింగ్, శుభ్‌మాన్ గిల్ వంటి యువకులకు అవకాశం లభించలేదు. ఇద్దరినీ రిజర్వ్ ప్లేయర్‌లుగా ఎంపిక చేశారు.
- ధోనీకి ఇదే లాస్ట్ మ్యాచ్?
ఐపీఎల్ 2024 ధోనీకి చివరి లీగ్ అని జరుగుతున్న ప్రచారాలను ఉతప్ప కొట్టిపారేశాడు. అప్పుడే మహీ వీడ్కోలు పలికే అవకాశం లేదని పేర్కొన్నాడు. లీగ్ స్టేజ్‌లో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై పైచేయి సాధించవచ్చని అన్నాడు. రుతురాజ్ కెప్టెన్సీలో మొదటి సీజన్‌లోనే సీఎస్కే నాకౌట్ దశకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
కాగా, సీఎస్కే మొత్తం 13 మ్యాచుల్లో 7 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై ఇప్పటికే ఆఖరి హోమ్ గేమ్ ఆడేసింది. బెంగళూరులో ఆర్సీబీతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.ఆరో స్థానంలో ఉన్న ఆర్సీబీకి, నాలుగో స్థానంలో ఉన్న చెన్నైకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. వాస్తవానికి సీఎస్కే తక్కువ మార్జిన్‌తో ఓడిపోయినప్పటికీ, మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ప్లేఆఫ్స్‌కు చేరవచ్చు. బెంగళూరు భారీ విజయం సాధిస్తేనే అవకాశం ఉంటుంది.