IPL 2024 Rajasthan Royals:ఐపీఎల్లో అత్యంత సాధారణంగా కనిపిస్తూ సంచలన విజయాలు నమోదు చేసే జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. 2008 తొలి సీజన్లోనే టోర్నీ ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ ఆ తర్వాత 15 సీజన్లపాటు ఒక్క టైటిల్ సాధించలేదు. టైటిల్ సంగతి అటుంచితే రాజస్థాన్ ఫైనల్‌దాకా చేరిన సందర్భాలు తక్కువే. 2022లో తుది పోరుకు అర్హత సాధించిన రాజస్థాన్, ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది.
ఇక చివరి ఐదు సీజన్లలో రాజస్థాన్ నాలుగుసార్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. జట్టులో కొందరు స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వాస్తవంలో వారుకూడా తేలిపోతున్నారు. ఇక ఈసారి ఎలాగైనా రెండో టైటిల్ ముద్దాడాలని ఆశిస్తున్న రాజస్థాన్ వేలం నుంచే అందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోమన్ పావెల్ (రూ.7.4 కోట్లు), మహారాష్ట్ర ప్లేయర్ శుభమ్ దూబె (రూ.5.4 కోట్లు)తో పాటు సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్‌బౌలర్ బర్గర్‌ను కొనుగోలు చేసింది. ఇక బలమైన జట్టుతో బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రెండోకప్ కల నెరవేరుతుందా? లేదా చూడాలి.
బలాలు: రాజస్థాన్‌కు ప్రధాన బలం ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్. అతడు ప్రతి సీజన్లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. టోర్నీలో ఒకట్రెండు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపిస్తాడు. ఇక టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ రాజస్థాన్‌కు ఎంతో కీలకం కానున్నాడు. ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఈ టోర్నీలో రాణిస్తే, రాజస్థాన్‌కు తిరుగుండదు! వీరికి తోడు సంజు శాంసన్, హెట్‌మయర్, రోమన్ పావెల్, ధ్రువ్ జురెల్‌తో రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్, అశ్విన్‌తో బౌలింగ్ కూడా బలంగా ఉంది.
బలహీనతలు: ప్రస్తుతం రాజస్థాన్ జట్టులోని కొందరు ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. నిలకడలేని ప్రదర్శనతో సంజు శాంసన్ ఎప్పుడూ సందేహాలు కలిగిస్తాడు. బౌల్ట్ ఒకప్పటి స్థాయిలో ప్రభావం చూపట్లేదు. చాహల్ స్పిన్‌లోనూ పదును తగ్గింది. మిడిలార్డర్ కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. పావెల్, ధ్రువ్ జురెల్ ఏమేర రాణిస్తారో చూడాలి. లీగ్ ఆరంభం నుంచి దేశీయ ఆటగాళ్లను ఎక్కువగా నమ్ముకుంటున్న రాయల్స్ కొన్నేళ్లుగా వారి నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోతుంది.
2024 రాజస్థాన్ తొలి 4 మ్యాచ్‌ల షెడ్యూల్
మ్యాచ్ | తేదీ | ఎప్పుడు | ఎవరితో | ఎక్కడ |
1 | మార్చి 24 | 3.30 PM | లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ | జైపుర్ |
2 | మార్చి 28 | 7.30 PM | దిల్లీ క్యాపిటల్స్ | జైపుర్ |
3 | ఏప్రిల్ 01 | 7.30 PM | ముంబయి ఇండియన్స్ | ముంబయి |
4 | ఏప్రిల్ 06 | 7.30 PM | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | జైపుర్ |