IPL 2024 Punjab Kings Shikhar Dhawan :ఐపీఎల్ 2024లో పెద్దగా ఆకట్టుకోని టీమ్‌లలో పంజాబ్ కింగ్స్ కూడా ఉంది. దిల్లీపై విజయంతో టోర్నీని ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నీ ఓడిపోయింది. ఏప్రిల్ 26న కోల్‌కతాలో కేకేఆర్‌తో పంజాబ్ తలపడుతోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌కు కెప్టెన్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉంటాడని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.
- చెన్నై మ్యాచ్‌కు ఫిట్‌గా ధావన్ -38 ఏళ్ల శిఖర్ ప్రస్తుత లీగ్‌లో చివరిసారిగా ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి గాయంతో దూరంగా ఉండటంతో, పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా సామ్ కరన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధావన్ ఎంట్రీపై పంజాబ్ స్పిన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి రియాక్ట్ అయ్యాడు. ధావన్ కోలుకుంటున్నాడని, మే 1న చెన్నై మ్యాచ్‌కు తిరిగి రావచ్చని చెప్పాడు. ‘ధావన్ ఫామ్‌లో ఉన్నాడు. మేము అతని బ్యాటింగ్ సేవలను నిజంగా కోల్పోయాం.’ అని అన్నాడు.
- దారుణంగా విఫలమైన జితేష్ -పంజాబ్ తరఫున ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో వికెట్ కీపర్, బ్యాటర్ జితేష్ శర్మ ఒకడు. 8 మ్యాచ్‌లలో 16.00 యావరేజ్‌తో కేవలం 128 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతడి అత్యధిక స్కోరు 29. పైగా మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయాడు.
జితేష్ గురించి జోషి మాట్లాడుతూ - "అంచనాలు అందుకోవాలనే ఒత్తిడి జితేశ్ శర్మను వెంటాడుతోంది. జితేశ్ నాణ్యమైన బ్యాటర్ అని అందరికీ తెలుసు. అతను అవకాశాలు కోల్పోయే సమయం వచ్చింది. ఈ పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అందరూ T20 ప్రపంచ కప్ జట్టులో ఉండటానికి ఆసక్తిగా ఉన్నారు. కానీ ఐపీఎల్ ఆడుతున్నప్పుడు మ్యాచ్‌లపైనే ఫోకస్ చేయాలి. అంతకు మించి ఆలోచించకపోవడమే మేలు. అప్పుడే మ్యాచ్‌లో చక్కగా పర్ఫార్మ్ చేయగలుగుతారు." అని చెప్పాడు.