IPL 2024 Lucknow super giants VS Delhi Capitals Rishabh Pant :దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో దిల్లీ తరపున మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మార్క్‌ను 104 మ్యాచుల్లో 3032 పరుగులు చేశాడు. 2041 బంతులు ఎదుర్కొని 3,032 పరుగులు సాధించాడు. పంత్ తర్వాత డేవిడ్ వార్నర్ 2, 549, శ్రేయస్స్ అయ్యర్ 2,375, వీరేంద్ర సెహ్వాగ్ 2, 174, శిఖర్ ధావన్ 2,066 పరుగులతో ఉన్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో పంత్ వరుసగా 18, 28, 51, 55, 41 పరుగులు చేశాడు.
మరో రికార్డును కూడా పంత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. రిషభ్ పంత్ ఐపీఎల్‌లో 26 ఏళ్ల 191 రోజు వయసులో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో 3 వేల పరుగులు పూర్తి చేసుకోగా, విరాట్ కోహ్లీ 26 ఏళ్ల 186 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 25 మంది బ్యాటర్లు 3 వేల పరుగులు స్కోరు చేశారు. స్ట్రైక్‌రేటు పరంగా ఏబీ డివిలియర్స్ 151.68, క్రిస్ గేల్ 148.96 తర్వాత పంత్ మాత్రమే 148.4 స్ట్రైక్ రేట్‌తో ఉన్నాడు.
పంత్ ఏమన్నాడంటే - "మనం ఛాంపియన్లుగా ఆలోచించాలని, కష్టపడి పోరాడాలని జట్టు సభ్యులకు చెప్పాను. మేం బంతితో కొన్ని సవాళ్లను అధిగమించలేకపోయాం. కొంతమంది ఆటగాళ్లు బాధ్యతలు తీసుకోవాలి. మేం జట్టుగా ముందుకు సాగాల్సి ఉంది. జట్టులో చాలామంది ఆటగాళ్లు గాయపడడం మాకు సమస్యగా మారింది. ఈ సమస్య అన్ని జట్లలోనూ ఉంది. మనం దీనిని ఒక సాకుగా చూపవచ్చు. దీని నుంచి నేర్చుకోవచ్చు" అని పంత్ అన్నాడు.