IPL 2024 Kolkata Knight Riders Seamer Harshit Rana Suspended :ఏప్రిల్ 29న కోల్‌కతా నైట్ రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ సీమర్ హర్షిత్ రాణా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో అతనికి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించారు. ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశారు.
కాగా, ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్షిత్ రాణా 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్ వికెట్ తీసిన సందర్భంలో హర్షిత్ రాణా సెలబ్రేట్ చేసుకున్న తీరుకు చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. రాణా తన చేతిని పోరెల్ వైపు చూపిస్తూ తిరిగి పెవిలియన్‌కు వెళ్లమని సూచించాడు. ఈ క్రమంలోనే మరోసారి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వబోయి ఆగిపోయాడు. ఇది కాస్త వివాదమైంది. అతడి చర్యను తప్పుబడుతూ అందరూ విమర్శించారు.
ఇప్పటికే ఓ సారి తంటాలు తెచ్చిన ‘కిస్’ - అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు రానా. అప్పుడు అతని మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించారు. ఇప్పుడు సోమవారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అదే తప్పును పునరావృతం చేశాడు.