Cat Case in Nalgonda : పోలీస్ స్టేషన్‌లో కేసులు అంటే గొడవలు, కొట్లాటలు, భూములు, చోరీలు ఇలా ఇతరత్రా మొదలైనవి కనిపిస్తుంటాయి. ఇవే కాకుండా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు వంటి కేసులూ పోలీస్ స్టేషన్‌కు వెళుతుంటాయి. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఓ పిల్లి విషయంలో రెండు కుటుంబాలు మధ్య తలెత్తిన గొడవ పోలీస్ ఠాణా వరకు వెళ్లింది. అదేంటి? పిల్లి గురించి వాగ్వాదానికి దిగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అసలు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యానికి తోడు ఇదేంటి ఇలా కూడా చేస్తారా అని ముక్కున వేలేసుకుంటారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,
నల్గొండ జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మీర్ బాగ్ కాలనీకి చెందిన పుష్పలత ఏడాది క్రితం మిల్క్ వైట్ కలర్ పిల్లిని తెచ్చుకొని తన ఇంట్లోనే ఉంచుకుంటూ పెంచుకుంటుంది. ఆ పిల్లి ఆరు నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్లు ఆ పిల్లి గురించి వెతుకుతూనే ఉన్నారు. అయినా దాని జాడ మాత్రం కనిపించలేదు. ఇటీవల వారి పక్కింట్లో అదే పోలికలతో ఉన్న బ్రౌన్ కలర్ పిల్లి కనిపించింది.
ఆ పిల్లిని చూసిన పుష్పలత కుటుంబం, ఆ పిల్లి తమదేనని, పక్కింటి వాళ్లు పిల్లిని ఎత్తుకెళ్లి పిల్లికి కలర్ వేశారంటూ వాగ్వాదానికి దిగారు. తమకు ఆరు పిల్లులు ఉన్నాయని, అందులో ఇదొకటి అని పక్కింటి వారు వాదించారు. దీంతో సమస్య పరిష్కారం కాక గత నెల 15న (జనవరి) టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో పుష్పలత కేసు పెట్టింది.
పోలీస్ స్టేషన్‌కు పిల్లి : పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో పోలీసులు ఆ పిల్లిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దాని వెంట్రుకలను పశు వైద్యాధికారి ద్వారా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మరో రెండు రోజుల్లో పిల్లి కలర్‌పై పూర్తి వివరాలు వస్తాయని, అప్పుడు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని టూ టౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. మరి రిపోర్టులో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాల్సిందే.