IPL 2024 Delhi Capitals :ఐపీఎల్‌లో ఇప్పటివరకు కప్పు కల నెరవేర్చుకోని జట్లలో దిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. ఒకప్పుడు దిల్లీ డేర్ డెవిల్స్ పేరుతో ఉండేది. ఆ తర్వాత 2019లో దిల్లీ క్యాపిటల్స్‌గా మారింది. అయితే ఒక జట్టులో మిగతా ప్లేయర్స్‌తో సంబంధం లేకుండా ఒక్క ఆటగాడి మీదే అందరి దృష్టి ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలా ఈ సారి అందరి ఫోకస్ ఈ జట్టు కెప్టెన్ పంత్ మీదే ఉండటం విశేషం. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు 14 నెలల తర్వాత ఈ సీజన్‌తోనే క్రికెట్లోకి అడుగుపెట్టబోతున్నాడతడు. దీంతో దిల్లీ టీమ్ ట్రోఫీని ముద్దాడుతుందో లేదో కానీ, పంత్ మాత్రం ఎలా బ్యాటింగ్ చేస్తాడు, వికెట్ కీపింగ్ ఎలా చేస్తాడు అంటూ అతడి ఫామ్, ఫిట్‌నెస్ గురించి అందరికీ ఆసక్తిగా మారింది. మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దిల్లీ జట్టు బలాబలాలపై ఓ లుక్కేద్దాం.
బలాల విషయానికొస్తే రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పృథ్వీ షాలతో దిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ బలంగా ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా వికెట్ కీపింగ్ బ్యాటర్స్ షై హోప్, ట్రిస్టియన్ స్టబ్స్, ఆసీస్ విధ్వంసక బ్యాటర్ జేక్ ఫ్రేజర్ కూడా జట్టుకు బలంగా ఉన్నారు. కానీ తుది జట్టులో ఎవరుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్‌తో స్పిన్ విభాగం బలంగానే ఉంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ మంచిగా రాణిస్తాడన్న అంచనాలు ఉన్నాయి.
బలహీనతల విషయానికొస్తే మిగతా టీమ్స్‌తో పోలిస్తే దిల్లీ క్యాపిటల్స్‌కు విదేశీ ఆటగాళ్ల బలం తక్కువనే చెప్పాలి. నోకియా గత రెండు సీజన్ల నుంచి నిలకడ ప్రదర్శన చేయట్లేదు. మిగతా ప్లేయర్స్‌లో మిచెల్ మార్ష్ తప్ప విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో రాణించిన ఎక్స్పీరియన్స్ లేదు. మిడిలార్డర్ కూడా బలహీనంగా ఉంది. దేశీయ పేస్ బలం కూడా అంత బలంగా కనిపించడం లేదు. ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మలపై పెద్దగా అంచనాలు లేవు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత బ్యాట్ పట్టుకోనున్న పంత్ మునుపటిలా మెరుపులు మెరిపించగలడా అన్నది పెద్ద ప్రశ్న.