IPL 2024 Chennai Super Kings vs Lucknow Super Giants :ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. మార్కస్ స్టొయినిస్(63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 124 నాటౌట్ ) ఒక్కడే మొదటి నుంచి చివరి వరకు క్రీడులో ఉండి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. లాస్ట్ ఓవర్లో చివరి మూడు బంతుల్లో విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. అయినా స్టొయినిస్ ఒత్తిడిలోనూ బంతిని బాది మ్యాచ్‌ను ముగించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ విజయం సాధించింది. అలా 211 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తంగా 213 పరుగులు చేసింది.
ఇక లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో చివర్లో వచ్చిన దీపక్ హోడా(6 బంతుల్లో 17 నాటౌట్) కూడా మంచి స్కోరే చేశాడు. మిగతా వారిలో దేవదత్ పడిక్కల్(19 బంతుల్లో 13 పరుగులు), నికోలస్ పూరన్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు), కేఎల్ రాహుల్(14 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో 16 పరుగులు) రన్స్ చేశారు. మతీశా పతిరణ 2, ముస్తాఫిజుల్ రెహ్మాన్, దీపక్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబే మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. లఖ్‌నవూ బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గైక్వాడ్‌కు ఇది తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ కావడం విశేషం. అంతకుముందు, ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్‌పై తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు రుతురాజ్. శివమ్ దూబే కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో ధోనీ చివరి బంతిని ఆడి ఫోర్ బాది అభిమానులను అలరించాడు. ఇక డారిల్ మిచెల్(10 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 11 పరుగులు), రవీంద్ర జడేజా(19 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు), అజింక్యా రహానే(3 బంతుల్లో 1 పరుగు) చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో మాట్ హెన్రీ, యశ్ ఠాకూర్, మోహ్షిన్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.