IPL 2024 CSK Bowlers Ruled out : చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్టైంది. వివిధ కారణాలతో జట్టులోని ఐదుగురు స్టార్ బౌలర్లు జట్టుకు అందుబాటులో లేరు. వీరిలో ముస్తాఫిజుర్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్, తీక్షణ, పతిరణ ఉన్నారు. వీళ్లు తిరిగి జట్టులోకి వస్తారా లేదా అనే విషయంపై కూడా ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. అసలే ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా, కఠినంగా మారుతున్న సమయంలో ఇలా ఒకేసారి ఐదుగురు బౌలర్లు జట్టుకు దూరమవ్వడం పెద్ద షాకే అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్ తన నెక్ట్స్ మ్యాచ్‌ను ఆడేందుకు మరో మూడు రోజుల సమయం మిగిలి ఉంది. ఈలోగా కనీసం ఇద్దరైనా తిరిగి జట్టులోకి వస్తారని టీమ్ యాజమాన్యం భావిస్తోంది.
అసలు ఏం జరిగిందంటే? - మే 3 నుంచి జింబాబ్వేతో బంగ్లాదేశ్ ఐదు టీ20ల సిరీస్ బరిలో దిగనుంది. దీనికోసం ముస్తాఫిజుర్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోతున్నాడు. ఈ సిరీస్ మే 12న ముగుస్తుంది. మళ్లీ మే 20 నుంచి బంగ్లాదేశ్ అమెరికాతో మరో టీ20 సిరీస్ ఆడనుంది. దీంతో ముస్తాఫిజుర్ తిరిగి చెన్నై జట్టుతో కలవడం కష్టమే.
అలానే మే1వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ గాయపడిన సంగతి తెలిసిందే. కేవలం రెండు బంతులే సంధించి మైదానాన్ని మ్యాచ్ మధ్యలోనే వీడాడు. అతడు కోలుకోవడానికి కనీసం నాలుగు రోజుల సమయం అయినా అవ్వొచ్చని సమాచారం అందుతోంది.