తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ ఫీవర్​- ఆ 5 జట్ల సారథులైతే మారారు- మరి రిజల్ట్స్​ సంగతేంటి?

IPL 2024 Captain List : అసలు సిసలైన క్రికెట్​ మజాను అందించే ఐపీఎల్‌-2024 మరో 10 రోజుల్లో షురూ కానుంది. ఈ 17వ సీజన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్​ లవర్స్​ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి బరిలోకి దిగే జట్లలో ఏకంగా 5 జట్ల నాయకులను మార్చారు ఆయా ఫ్రాంచైజీల ఓనర్లు. మరి కొత్తగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సదరు ఆటగాళ్ల సాధ్యాసధ్యాలపై ప్రత్యేక కథనం.

IPL 2024
IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 7:39 PM IST

IPL 2024 Captain List : పాకిస్థాన్​-భారత్​ ప్రపంచకప్ మ్యాచ్​​కు ఏ విధంగా క్రేజ్​ ఉంటుందో అంతకు రెట్టింపు ఆదరణ ఉంటుంది ఐపీఎల్​ టోర్నమెంట్​ మ్యాచ్​లకు. క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఈసారి ఐపీఎల్‌-2024 మెగా సమరం సిద్ధమవుతోంది. టైటిల్​ గెలవడమే లక్ష్యంగా తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ అన్ని జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి.

అయితే ఈసారి జరగబోయే 17వ సీజన్​లో పలు కీలక మార్పులు జరగాయి. అదే 5 ప్రధాన జట్ల సారథుల మార్పు. మరి ఈ మార్పుల్లో తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టేవారితో పాటు ఇతర టీంకు అంతకుముందు కెప్టెన్​గా వ్యవహరించి ప్రస్తుతం వేరే జట్టుకు నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్లేయర్ల బలాబలాలు ఏంటి? వారు ఆయా జట్లను ఎలా నడిపిస్తారు? అభిమానుల అంచనాలు అందుకుంటారా? అనే విషయాల గురించి ఎక్స్​పర్ట్స్​ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పాండ్యకు పగ్గాలు
ముంబయి ఇండియన్స్‌ను అత్యధికంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు హిట్​మ్యాన్​​ రోహిత్‌ శర్మ. అయితే రోహిత్​ను కాదని ఈసారి గుజరాత్‌ నుంచి వచ్చిన హార్దిక్‌ పాండ్యకు ఎంఐ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. గుజరాత్‌ను విజయపథంలో నడిపి ఒకసారి విజేతగా, మరోసారి రన్నరప్‌గా నిలిపిన పాండ్య ఈసారి ముంబయిని ఎలా నడిపిస్తాడో చూడాలి.

గత కొన్ని సీజన్లుగా ముంబయి ప్రదర్శన ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. గత సీజన్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా 2022లో దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అలాంటి జట్టును తిరిగి గాడిలో పెట్టి ఛాంపియన్‌గా నిలబెట్టడం పాండ్యకు పెద్ద సవాలే అంటున్నారు విశ్లేషకులు.

యంగ్​ ప్లేయర్​కు కెప్టెన్సీ
హార్దిక్‌ పాండ్య గుజరాత్​ను టీమ్‌ను వీడటం వల్ల జట్టు పగ్గాలను యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు అప్పగించారు. బ్యాటింగ్‌లో సత్తా చాటి జట్టుకు అనేక విజయాలు అందించిన గిల్‌, ఈ సారి కెప్టెన్‌గా కొత్త పాత్రలో ఎలా రాణిస్తాడో చూడాలి. గత సీజన్‌లో 17 ఇన్నింగ్స్‌ల్లో 890 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు ఈ యువ ఆటగాడు.

ఈ సారి బ్యాటింగ్‌తో పాటు జట్టు సమన్వయ బాధ్యతలనూ చూసుకోవాలి. తక్కువ వయసు, కొద్దిపాటి అనుభవంతో ఆడి, ఆడించడం కత్తి మీద సామే అని అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. సీనియర్లను, తనతోటి ప్లేయర్స్​ను సమన్వయం చేసుకుని జట్టు ముందుకు తీసుకెళ్లడం ఏమంత సులభం కాదనే చెప్పాలి.

సన్‌'రైజ్​' అయ్యేనా?
గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీంకు కూడా కొత్త కెప్టెన్‌ వచ్చాడు. మినీ వేలంలో పాట్‌ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన కమిన్స్‌ సన్‌రైజర్స్‌ రాతా మార్చుతాడా అన్నది చూడాలి. గతంలో డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలో 2016లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజేతగా నిలిచింది. అయితే ఈసారి కమిన్స్‌ నేతృత్వంలో ఛాంపియన్‌గా నిలవాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.

కోల్‌కతాకు అయ్యర్​ అండ?
భారీ అభిమాన గణం ఉన్న జట్లలో కోల్‌కతా ఒకటి. అయితే ఈ జట్టు గత కొంత కాలంగా తీవ్రంగా నిరాశపరుస్తూ వస్తుంది. కోచ్‌ చంద్రకాంత పండిట్‌ ఆధ్వర్యంలో గత సీజన్‌లో అనుభవం లేని నితీశ్‌ రాణా నేతృత్వంలో ఆ జట్టు పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. గతేడాది గాయం కారణంగా దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి ఏకంగా సారథిగా వస్తున్నాడు. బ్యాటింగ్‌లో దూకుడు చూపించే అయ్యర్‌ జట్టును అదే విధంగా నడిపిస్తాడని కేకేఆర్​ యాజమాన్యం ఆశలు పెట్టుకుంది.

పంత్​ కోలుకున్నాడు సరే- మరి దిల్లీ?
ఒక్కసారి కూడా టెటిల్‌ గెలవని జట్లలో దిల్లీ క్యాపిటల్స్​ ఒకటి. రోడ్డు ప్రమాదం కారణంగా గత సీజన్‌కు దూరమైన రిషభ్​ పంత్‌ ఈ సీజన్‌లో తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాబోతున్నాడు. అయితే అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. బ్యాటర్‌గానే కొనసాగుతాడని, వికెట్​ కీపింగ్‌ చేయడని తెలుస్తోంది. అయితే​ ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడేది కూడా పంత్​ ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జట్టును పంత్‌ తనదైన వ్యూహాలతో ఎలా నడిపిస్తాడోనని అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఫిట్​నెస్సే అడ్డంకిగా మారి పంత్‌ ఒకవేళ అందుబాటులోకి రాకపోతే దిల్లీని డేవిడ్‌ వార్నరే నడిపిస్తాడని ఇప్పటికే ప్రకటించారు. కాగా, అప్పుడు ఈ జట్టు పాత కెప్టెన్‌ ఆధ్వర్యంలోనే బరిలోకి దిగుతుంది.

ఈ జట్లకు పాతోళ్లే
ఇక మిగతా ఐదు జట్లు పాత సారథుల నేతృత్వంలోనే బరిలోకి దిగనున్నాయి. సీఎస్​కేకి మహేంద్ర సింగ్‌ ధోనీ, రాజస్థాన్‌ రాయల్స్​కు సంజూ శాంసన్‌, ఆర్సీబీకి ఫాఫ్‌ డు ప్లెసిస్‌, లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌, పంజాబ్‌ కింగ్స్‌కు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. కాగా, ఈనెల 22 నుంచి ఐపీఎల్​-2024 17వ సీజన్‌ ప్రారంభం కానుంది.

ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్! అంత టైమ్ ఎక్కడుందబ్బా?

రోహిత్ ముంబయిని వదిలేస్తే బెటర్- ఆ జట్టులోకి వెళ్తే కెప్టెన్ అవుతాడు!

ABOUT THE AUTHOR

...view details