Ind Masters Vs SL Masters 2025 :క్రికెట్ లవర్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూపీఎల్ 2025తో క్రికెట్ ఫ్యాన్స్ చిల్ అవుతుండగా, ఇప్పుడు మరో టోర్నీ వాళ్లందరినీ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) తొలి సీజన్ శనివారం (ఫిబ్రవరి 22) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్ భారత్- శ్రీలంక జట్ల మధ్యే జరగనుంది. ఈ ఐకానిక్ మ్యాచ్‌కు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.
కాగా, ఈ టోర్నమెంట్లో టీమ్ఇండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో క్రికెట్ అభిమానులకు సచిన్‌ను మరోసారి బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గానూ చూసే అరుదైన అవకాశం వచ్చింది. సచిన్ మళ్లీ బ్యాట్ అందుకొని భారత్ తరఫున బరిలోకి దిగితే చూడాలని చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
దశాబ్దం తర్వాత
ఇక ఈ జట్టులో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో యువీ బరిలోకి దిగనున్నాడు. దీంతో దశాబ్ద కాలం తర్వాత సచిన్- యూవీ మైదానంలో కలిసి ఆడనున్నారు. ఈ జోడీ 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. వీరిద్దరూ మళ్లీ టీమ్ఇండియా జెర్సీ ధరించి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఈ ఐకానిక్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.
మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి?
- IML మ్యాచ్‌లకు భారత్‌లోని మూడు ప్రధాన నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబయిలో షెడ్యూల్ చేశారు. ఆ తర్వాతి మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో నిర్వహిస్తారు. సెమీస్ ఇంకా, ఫైనల్ మ్యాచ్‌లకు రాయ్‌పూర్ వేదిక కానుంది.