Bumrah 400 Wickets :బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే బుమ్రా అరుదైన మైలురాయి అందుకున్నాడు. బుమ్రా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 36.5వ ఓవర్ వద్ద హసన్ అహ్మద్ వికెట్‌తో బుమ్రా ఈ ఫీట్ అందుకున్నాడు. కాగా , ఈ ఫీట్ సాధించిన 6వ టీమ్ఇండియా పేసర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 687 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా భారత్ నుంచి 400+ వికెట్లు తీసిన 10వ బౌలర్‌గానూ బుమ్రా నిలిచాడు.
బుమ్రా కంటే ముందు 400 అంతర్జాతీయ వికెట్లు తీసిన భారత పేసర్లు :
- కపిల్ దేవ్- 687 వికెట్లు
- జహీర్ ఖాన్- 597 వికెట్లు
- జవగల్ శ్రీనాథ్- 551 వికెట్లు
- మహ్మద్ షమీ- 448 వికెట్లు
- ఇషాంత్ శర్మ- 434 వికెట్లు
- జస్ప్రీత్ బుమ్రా-401 వికెట్లు
సూపర్ సక్సెస్ బౌలర్
2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బుమ్రా అప్పట్నుంచి టీమ్ఇండియాకు కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమ్ఇండియా చరిత్రలో నాణ్యమైన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. బుల్లెట్‌లాంటి యార్కర్లు, టెక్నిక్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అయితే పరుగుల కట్టడి చేస్తూ వికెట్ల తీయడంలో దిట్ట అని చెప్పొచ్చు. ఇక ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 196 మ్యాచ్‌ల్లో 401* వికెట్లు పడగొట్టాడు. అందులో టెస్టు (163), వన్డే (149), టీ20 (89) ఉన్నాయి. కాగా, వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు, టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రికార్డు బుమ్రా పేరిటే ఉంది.