IND W vs NZ W 2024 :2024 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో హర్మన్‌సేన తొలి పోరుకు సిద్ధమైంది. శుక్రవారం (అక్టోబర్ 04) టీమ్ఇండియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇక ఈసారైనా పొట్టి కప్పు పట్టేయాలని కసితో బరిలో దిగుతున్న హర్మన్‌సేనకు ఆరంభంలోనే గట్టి ప్రత్యర్థి ఎదురవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో సరిసమానంగా ఉన్న కివీస్, భారత్‌కు గట్టి పోటి ఇస్తుందనడంలో సందేహం లేదు. గ్రూప్ Aలో అన్ని బలమైన జట్లే ఉన్నాయి. భారత్ సెమీస్ చేరాలంటే టోర్నీలో తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేస్తే కాస్త ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.
టాపార్డర్ రాణిస్తేనే
బ్యాటింగ్‌లో భారత్‌కు ప్రధాన బలం ఓపెనర్లు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఓపెనర్లు స్మృతిమంధాన, షెఫాలి వర్మ మంచి ఆరంభం ఇస్తే, మిడిలార్డర్లో హర్మన్ దాన్ని కొనసాగించాలి. అయితే ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకనైనా ఫామ్ అందుకొని పరుగులు వరద పారించాలి. వీరితోపాటు జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా రాణిస్తే భారత్‌కు భారీ స్కోర్ ఖాయం. మరోవైపు బౌలర్లు కొంతకాలంగా మెరుగైన ప్రదర్శనే కనబరుస్తున్నారు. స్పిన్నర్లకు అనుకూలించే దుబాయ్ పిచ్‌లపైన దీప్తి, ఆశ శోభన, రాధ యాదవ్ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలిగితే మనదే విజయం!
ప్రత్యర్థి బలమైనదే
ఇటు న్యూజిలాండ్ కూడా స్టార్ ప్లేయర్లతో నిండి ఉంది. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచగల బలమైన ఆల్‌రౌండర్లు ఆ జట్టు సొంతం. కెప్టెన్ సోఫీ డివైన్, లీగ్ కాస్పరెక్, బ్రూక్ హాలిడేతో పాటు ఓపెనర్ సుజీ బేట్స్ సైతం బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలదు. వీరికి తోడు జెస్ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్, ఫ్రాన్ జోనాస్‌లతో బౌలింగ్ విభాగమూ మెరుగ్గానే కనిపిస్తోంది.