India Vs Bangladesh T20 Series : బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం తాజాగా బీసీసీఐ టీమ్ఇండియా స్క్వాడ్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో ఇద్దరు ప్లేయర్ల పేర్లును ప్రస్తావించలేదు. ఇంతకీ ఆ ఇద్దరు మరెవరో కాదు ఇటీవల దులీప్ ట్రోఫీలో భారీ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్, కెప్టెన్సీతో పాటు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్. ఈ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ తుది జట్టులో వీళ్ల పేర్లు లేకపోవడం పట్ల అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, సెలక్షన్ కమిటీపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. "బీసీసీఐ తీరు సిగ్గుచేటు. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోతే ఎలా?" అని ఓ యూజర్ అనగా, "ఇది రుతురాజ్‌కు నష్టం కాదు. బీసీసీఐకే నష్టం. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం వల్ల భారత జట్టుకే నష్టం" అంటూ ఇంకో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ముగ్గురికి అందుకే రెస్ట్
ఇదిలా ఉండగా, ఈ టీ20 జట్టులో సూర్యకుమార్ యాదవే సీనియర్. సంజూ శాంసన్ ఉన్నప్పటికీ, అతడకి అంతర్జాతీయ అనుభవం తక్కువే. అయితే రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. రానున్న టెస్టు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురు యువ క్రికెటర్లైన అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాకు ఈ తుది జట్టులో అవకాశం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించలేకపోతున్న సంజూ శాంసన్‌ను ఈ టీమ్‌లోకి మరోసారి ఎంపిక చేయడం గమనార్హం. కేవలం ఒక్క స్పెషలిస్ట్ ఓపెనర్‌ను మాత్రమే ఈ సారి మేనేజ్‌మెంట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో రెండో ఓపెనర్‌గా ఎవరు వస్తారన్న విషయంపై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.