CM Revanth Reddy About Manmohan Singh : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇ్వవాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన మృతి పట్ల నివాళులర్పించిన శాసనసభ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపింది. సరళీకృత ఆర్థిక విధానాలతో మన్మోహన్‌సింగ్ భారత్‌ను బలమైన ఆర్థికశక్తిగా నిలబెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ఆత్మబంధువుగా మన్మోహన్‌సింగ్ స్థానం ప్రజల గుండెల్లో శాశ్వతమని తెలిపారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్ పీవీ నరసింహారావుకు సైతం దిల్లీలో స్మారకం ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉండి పీవీకి కాంగ్రెస్ గౌరవం ఇవ్వకపోయినా ఇప్పుడు మోదీ సర్కార్ మన్మోహన్‌సింగ్‌కు స్మారకం నిర్మిస్తోందని బీజేపీ తెలిపింది.
బలమైన ఆర్థికశక్తిగా : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కుటుంబానికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి సరళీకరణ విధానాలతో దేశాన్ని ప్రపంచంలో బలమైన ఆర్థికశక్తిగా మన్మోహన్‌సింగ్ నిలిపారని పేర్కొన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేలా ఉపాధిహామీ, సమాచార హక్కువంటి చట్టాలతో పదేళ్ల పాటు దేశానికి గొప్పపాలన అందించారని కొనియాడారు.
"మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు. మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తన సహనాన్ని కోల్పోలేదు. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టి సారించారు. ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా మాతో పాటు ఆయన దిల్లీలో నిరసనలో పాల్గొన్నారు. అది మాకు జీవిత కాలం గుర్తుండిపోయే సంఘటన. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనలో పాల్గొనడం వారి నిరాడంబరతకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్" - రేవంత్ రెడ్డి, సీఎం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ఆత్మబంధువుగా మారారని తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని సీఎం తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనంతరం హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి ఆనాడు మన్మోహన్‌సింగ్ హయాంలో జరిగిన రుణమాఫీయే స్ఫూర్తి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
ఆర్థిక సంస్కరణల శీలి : 15 రోజులే విదేశీ మారక నిల్వలు ఉన్న స్థాయి నుంచి ప్రపంచమే అబ్బురపడే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లిన ఆర్థిక సంస్కరణ శీలి మన్మోహన్ సింగ్ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామిక ఉద్యమాలకూ మన్మోహన్ సింగ్ మద్దతిచ్చారని ఆయన హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిష్కృతమైందని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నామన్న కేటీఆర్ దిల్లీలో పీవీ మెమోరియల్ ఏర్పాటుపైనా తీర్మానం చేయాలని కోరారు.
స్మారక చిహ్నం ఏర్పాటు : ఆర్థిక వేత్తగా దేశంలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలు ఎన్నటికీ మరువబోరని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మోదీ సర్కార్ మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేయబోతోందని తెలిపారు.
నీతి, నిజాయితీకి నిలువుటద్దం : ప్రధానిగా మన్మోహన్‌సింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేశారని మజ్లిస్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ తెలిపారు. మన్మోహన్ సింగ్ నీతి, నిజాయతీలకు నిలువుటద్దమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గుర్తుచేశారు. మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి మన్మోహన్‌సింగ్ సేవలను కొనియాడారు. అనంతరం మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని చదివి వినిపించిన స్పీకర్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
భారత ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ ఊపిరిలూదారు : సీఎం రేవంత్ రెడ్డి
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి