India vs Pakistan U19 Asia Cup 2024 :2024 అండర్ 19 ఆసియా కప్ టోర్నీని భారత్ కుర్రాళ్లు ఓటమితో ప్రారంభించారు. తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో ఓడింది. పాక్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 47.1 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. నిఖిల్ కుమార్ (67 పరుగులు) ఒక్కడే రాణించాడు. పాక్‌లో అలీ రెజా 3, అబ్దుల్ శుభమ్, ఫహమ్ ఉల్ హక్ తలో 2, నవీద్ , ఉస్మాన్ ఖాన్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. సూపర్ సెంచరీతో అదరగొట్టిన పాక్ బ్యాటర్ షహబాజ్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారీ అంచనాలతో
ఇటీవల ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న 13ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అంచనాలు బాగా పెరిగాయి. అతడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆడుతున్న తొలి టోర్నీ కావడం వల్ల అందరి కళ్లూ అతడిపైనే ఉన్నాయి. అండర్-19 ఆసియా కప్‌లో భారీగా పరుగులు చేస్తాడని భారత అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, తొలి మ్యాచ్‌లో ఈ కుర్రాడు తీవ్రంగా నిరాశపర్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ 9 బంతుల్లో కేవలం ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. అలీ రజా బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత మ్యాచ్‌ల్లోనైనా వైభవ్ రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. షహబాజ్ ఖాన్ (159 పరుగులు) భారీ సెంచరీతో అదరగొట్టాడు. ఉస్మాన్ ఖాన్ (60 పరుగులు) రాణించారు. భారత్ బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ 3, అయూశ్ హత్రే 2, కిరణ్ చోర్మలే, యుధజిత్ తలో 1 వికెట్ పడగొట్టారు. కాగా, భారత్ తమ రెండో మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. షార్జా వేదికగా డిసెంబర్ 2న ఈ మ్యాచ్ జరగనుంది.