India Open 2024 Finals Chirag Shetty and Rankireddy : భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 ఫైనల్స్‌లో నిరాశ ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ఫలితంగా టైటిల్‌ను కైవసం చేసుకోలేకపోయింది.
ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తుదిపోరులో మూడో సీడ్, కొరియాకు చెందిన మిన్ హ్యూక్ కాంగ్ - సీయుంగ్ జే సియో ద్వయం చేతిలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఓటమి పాలయ్యారు. 21-15 11-21 18-21 తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమితో భారత జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ఏడాది సాత్విక్ జోడీ వరుసగా రెండో ఫైనల్‌లో ఓడింది. గత వారం మలేసియా ఓపెన్‌లోనూ భారత జోడీకి నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.
మ్యాచ్ సాగిందిలా :ఈ ఇండియా ఓపెన్ ఫైనల్‌లో తొలి గేమ్‌లో సాత్విక్ ద్వయం ఈజీగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ రౌండ్ కేవలం 17 నిమిషాలోనే ముగిసింది. అయితే రెండో గేమ్‌లో కొరియా జోడీ పట్టు బిగించింది. గేమ్ ఆరంభం నుంచే పంజుకున్న ఈ ద్వయం ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా పాయింట్లను అందుకుంటూ 21-11తో మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ కూడా హోరా హోరీగా సాగింది. మొదట 8-12తో వెనకపడిన భారత జోడీ(సాయిరాజ్ - చిరాగ్ శెట్టి) తర్వాత పట్టువదలకుండా గొప్పగా పోరాడింది. వీరిద్దరు 16-17తో స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించారు. కానీ కొరియా షట్లర్లు కూడా దూకుడును ప్రదర్శించి మ్యాచ్‌ను గెలుచుకున్నారు.