India House at Paris Olympic 2024 :ఒలింపిక్స్ చరిత్రలో మొదటిసారిగా ఇండియా సొంత పెవిలియన్ ఏర్పాటు చేయనుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 'ఇండియా హౌస్' పేరిట పెవిలియన్ అందుబాటులోకి రానుంది. గ్లోబల్ లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన 'బ్యూటిఫుల్ ఇండియా' దాని అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఇండియా హౌస్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ పాపులర్ సింగర్ షాన్ తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టనున్నారు.
ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి కంట్రీ హౌస్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ దీన్ని రూపొందించింది. ఇది టెక్నాలజీ, డిజిటలైజేషన్‌లో పురోగతితో పాటు భారతదేశపు చరిత్రాత్మక గతం, శక్తివంతమైన వర్తమానం, ఉత్తేజకరమైన భవిష్యత్తును ప్రదర్శిస్తుంది. భారతీయ తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, ప్రముఖులు, క్రీడా ఔత్సాహికులకు ఇండియా హౌస్ తలుపులు తెరుస్తుంది.
ఇండియా హౌస్ విజన్
రిలయన్స్ ఫౌండేషన్, IOA, ఇండియా హౌస్‌ను దేశ సాంస్కృతిక, క్రీడా వారసత్వానికి వేడుకగా భావించాయి. ఈ పెవిలియన్ భారతదేశ గతం, వర్తమానం, భవిష్యత్తుతో పాటు టెక్నాలజీ, డిజిటల్ పురోగతిని హైలైట్ చేస్తుంది.
ఇండియా హౌస్ ప్రాముఖ్యత
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా హౌస్ ప్రాముఖ్యత అపారమైంది. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి మొట్టమొదటి కంట్రీ హౌస్‌గా, భారతదేశ ఒలింపిక్ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. పెవిలియన్ ఏర్పాటు దిశగా చాలా కాలం క్రితం నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏడాది భారత్‌లో IOC సమావేశాలు జరిగాయి. 40 సంవత్సరాల్లో మొదటిసారి ఈ కార్యక్రమానికి ఇండియా కేంద్రమైంది.
ఇండియా హౌస్ ప్రత్యేకతలు
ఇండియా హౌస్ పారిస్‌లోని ప్రఖ్యాత పార్క్ డి లా విల్లెట్‌లో ఉంటుంది. ఈ పెవిలియన్ భారతీయ క్రీడలు, టెక్నాలజీ, గ్యాస్ట్రోనమీ, కళలు, సంస్కృతిని తెలియజేస్తుంది. సందర్శకులు యోగా తరగతులు, సాంస్కృతిక సెమినార్లలో పాల్గొనవచ్చు. సాంప్రదాయ భారతీయ హ్యాండ్క్రాఫ్ట్స్ను నేర్చుకోవచ్చు. చాలా రకాల ఈవెంట్లు, కార్యక్రమాలను చూడవచ్చు. ఈ పెవిలియన్‌ను నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) అరంగేట్రం చేయనుంది. తద్వారా ఎక్స్‌పెరిమెంటల్ ప్రోగ్రామ్స్, భారతదేశ నేపథ్య సంగీత, నృత్య ప్రదర్శనలు అందించనుంది.
భారతీయతను అనుభవించే అవకాశం
పారిస్‌లోని మూడో అతిపెద్ద పార్క్ 'పార్క్ డి లా విల్లెట్' ఒలింపిక్ క్రీడల సమయంలో పార్క్ డెస్ నేషన్స్‌గా మారనుంది. ఇండియా హౌస్ చుట్టూ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, కెనడా, బ్రెజిల్, మెక్సికో, చెక్ రిపబ్లిక్, సౌతాఫ్రికా, కొలంబియా వంటి ఇతర హౌస్‌లు ఉంటాయి.