India Vs Pakistan ICC Champions Trophy 2025 : దాయాది దేశం పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు తటస్థ వేదికగా యూఏఈలో జరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధి అమిర్ మీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత్ తుది పోరుకు అర్హత సాధించకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహోర్‌లో జరిగే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. టోర్నీ తుది షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలో ప్రకటించనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కీలక నిర్ణయం
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఇందుకోసం అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ తటస్థ వేదిక ఏంటనేది ఆతిథ్య దేశమైన పాకిస్థాన్ నిర్ణయించాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్థాన్ తటస్థ వేదికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. యూఏఈ వేదికగా భారత్ ఆడే మ్యాచ్‌లు నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించిందట. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి కూడా అధికారికంగా తెలిపిందని సమాచారం. ఈ మేరకు పీసీబీ అధికారి అమిర్ మీర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
యూఏఈ మంత్రి, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధిపతి షేక్ నహ్యాన్ అల్ ముబారక్‌తో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇటీవలే సమావేశమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచ్‌లకు యూఏఈని తటస్థ వేదికగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.
యూఏఈ వేదికగా భారత్ మ్యాచ్‌లు
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అలాగే అదే నెల 20న బంగ్లా, మార్చి 2న కివీస్‌తో టీమ్ ఇండియా లీగ్ దశలో మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయని అంతా భావించారు. కానీ యూఏఈని తటస్థ వేదికగా పీసీబీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లు అక్కడే!
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మినహా మిగతా జట్లు ఆడే మ్యాచ్‌లు లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికగా జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ మార్చి 4, 5న జరగనుంది. ఒకవేళ భారత్ సెమీ ఫైనల్‌కు క్వాలిఫై అయితే యూఏఈలో మ్యాచ్ జరుగుతుంది. లేదంటే పాకిస్థాన్‌లోని స్టేడియంల వేదికగా సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి.
హైబ్రిడ్ మోడల్లో టోర్నీ
ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. ఈ విషయాన్ని ఐసీసీ ఇటీవలే ప్రకటించింది. 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లు (భారత్, పాకిస్థాన్‌లో ఎక్కడ జరిగినా) తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (భారత్), 2026 టీ20 ప్రపంచ కప్ (భారత్, శ్రీలంక)లో జరగనున్నాయి. ఈ టోర్నీల కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించదు. తటస్థ వేదికలో పాక్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 2028 టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. ఈ టోర్నీకి కూడా హైబ్రిడ్ మోడల్ నిబంధన వర్తిస్తుంది.
ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న రాజకీయ సంబంధాల కారణంగా 2008 నుంచి పాకిస్థాన్‌లో భారత్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ వెళ్లబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహణకు ఐసీసీ ఒకే చెప్పింది.
హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ - అధికారికంగా ప్రకటించిన ఐసీసీ
సచిన్ అంబాసిడర్‌గా ఉన్న క్రికెట్ లీగ్‌పై ఐసీసీ నిషేధం - ఎందుకంటే?