Cricketers Who Rejected By IPL Franchises : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిసెంబర్ 15న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎంతో ఉత్కంఠగా సాగింది. ముంబయి, మధ్యప్రదేశ్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనగా, ఆఖరికి ముంబయినే విజయం వరించింది. అయితే ఈ టోర్నీలో ఎంతో మంది ప్లేయర్లు అనూహ్యంగా రాణించి జట్టులో కీలక భాగమయ్యారు. ఐపీఎల్‌లో రిజెక్ట్ అయినా కూడా తమ ట్యాలెంట్‌ను ఈ వేదికపై నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యంగ్ ప్లేయర్స్. ఇంతకీ వారెవరో చూద్దామా.
త్రిపురేష్ సింగ్ (మధ్యప్రదేశ్)
ఐపీఎల్ వేలంలో మధ్యప్రదేశ్‌కు చెందిన యువ బ్యాటర్ త్రిపురేష్ సింగ్ కూడా అమ్ముడుపోలేదు. పెద్దగా అంచనాలు లేకపోయినా, సింగ్ T20 క్రికెట్‌లో 170 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. సెమీ-ఫైనల్‌లో బ్యాటింగ్ చేయలేకపోయినా, ఫైనల్‌లో కీలకం కానున్నాడు. లోయర్ ఆర్డర్‌లో భారీ హిట్టింగ్‌కి దిగగల సింగ్, ముంబయి బౌలర్‌లకు పరీక్ష పెట్టగలడు.
అధర్వ అంకోలేకర్ (ముంబయి)
యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ అథర్వ అంకోలేకర్‌కి కూడా ఐపీఎల్ ఛాన్స్ రాలేదు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబయికి కీలక ఆటగాడిగా మారాడు. గతంలో భారత్ అండర్-19 ఆడాడు. అంకోలేకర్ తన కెరీర్‌లో 14 టీ20 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టాడు. 126 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. కీలక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయాలని ఎదురుచూస్తున్నాడు.
హార్దిక్ తమోర్ (ముంబయి)
వేలంలో అమ్ముడుపోని మరో ముంబయి ఆటగాడు వికెట్ కీపర్-బ్యాటర్ హార్దిక్ తమోర్. తమోర్ హార్డ్-హిట్టింగ్ చేయగలడు, ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంది. ఇటీవల మ్యాచ్‌లలో అతడికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. దీంతో సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్నాడీ యంగ్ ప్లేయర్.
పృథ్వీ షా (ముంబయి)
ఒకప్పుడు భారత క్రికెట్‌లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. ఈ ముంబయి ఓపెనర్ కొంతకాలంగా కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. మళ్లీ ట్రాక్‌లో పడటానికి ప్రయత్నిస్తున్నాడు. సెమీ-ఫైనల్‌లో షా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో, ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 26 బంతుల్లో 49 పరుగులు చేసిన షా, అందులో 5 బౌండరీలు 4 సిక్సర్లు ఉండటం విశేషం.
శార్దూల్ ఠాకూర్ (ముంబయి)
శార్దూల్ ఠాకూర్‌కి చాలా అనుభవం ఉంది. బ్యాట్, బాల్ రెండింటితో రాణించగలడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. గత సీజన్‌లో చెన్నై తరఫున 9 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదు వికెట్లు తీశాడు. దీంతో వేలంలో ఏ జట్టు కొనలేదు. కానీ తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన సత్తా చాటేందుకు బరిలోకి దిగగా, అతడికి నిరాశే ఎదురైంది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్లలో ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే ఫ్యూచర్లోనైనా తన ప్రతిభను చూపించే మంచి ఫ్లాట్‌ఫామ్ దక్కాలని కోరుకుంటున్నారు.
గూగుల్ 2024 ట్రెండ్స్ - అగ్రస్థానంలో ఐపీఎల్ - ఇంకా ఏ మ్యాచ్‌ల కోసం వెతికారంటే?
'తన వ్యాల్యు టెస్ట్ చేసుకోవాలనుకున్నాడు- అందుకే వేలంలోకి పంత్'