SBI Report On Household savings : భారతీయ కుటుంబాల పొదుపు విధానాలు గత 3 సంవత్సరాల్లో గణనీయంగా మారాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. సాధారణ ప్రజలు తమ డబ్బులను సంప్రదాయ బ్యాంకు డిపాజిట్లలో కంటే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలకు మళ్లిస్తున్నారని పేర్కొంది.
'సాధారణ భారతీయ కుటుంబాలు బ్యాంక్ డిపాజిట్లలో చేసిన పొదుపు వాటా 2021లో 47.6 శాతం ఉండగా, అది 2023 నాటికి 45.2 శాతానికి పడిపోయిందని' ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. మరోవైపు జీవిత బీమాలో సాధారణ గృహస్థుల పెట్టుబడులు 2021లో 20.8 శాతం ఉండగా, అవి 2023 నాటి 21.5 శాతానికి పెరిగాయి. మ్యూచువల్ ఫండ్లలో అయితే ప్రజల పెట్టుబడుల వాటా 2021లో 7.6 శాతం ఉండగా, అది 2023 నాటికి 8.4 శాతానికి పెరిగింది. అంటే 'దేశంలో బ్యాంక్ డిపాజిట్లు, కరెన్సీల వాటా తగ్గి, మ్యుచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ లాంటి వాటిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి' అని ఎస్‌బీఐ రిపోర్ట్ పేర్కొంది.
సేవింగ్స్ పెరుగుతున్నాయ్!
సామాన్య కుటుంబాల నికర ఆర్థిక పొదుపు కూడా గణనీయంగా పెరిగిందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. '2014 ఆర్థిక సంవత్సరంలో గృహస్థుల నికర ఆర్థిక పొదుపు 36 శాతం ఉండగా, అది 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 52 శాతానికి పెరిగిందని పేర్కొంది. అయితే డబ్బుల రూపంలో చేసే పొదుపు మాత్రం తగ్గిందని' పేర్కొంది. 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో డబ్బు రూపంలో చేసిన పొదుపు మందగమనంలో ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో అది బాగా క్షీణించదని పేర్కొంది.
ఇతర దేశాలతో పోలిస్తే మనమే బెస్ట్!
ప్రపంచ దేశాలతో పోల్చితే, భారత్ పొదుపు రేటు ఎక్కువగా ఉందని ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. పొదుపులో ప్రపంచ సగటు 28.2 శాతం ఉండగా, భారత్‌లో అది 30.2 శాతంగా ఉంది. ఇది భారత్‌లో పెరుగుతున్న పొదుపు సంస్కృతిని, పెరుగుతున్న ఫైనాన్సియల్ ల్యాండ్‌స్కేప్‌ను తెలియజేస్తుందని రిపోర్ట్ పేర్కొంది.
'ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ విధానపరమైన చర్యల వల్ల ఇండియన్ ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్ గణనీయంగా పెరిగింది. ఎలా అంటే, 2011లో భారత్‌లో సుమారుగా 50 శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి 80 శాతానికి పెరిగాయని తెలిపింది. సాధారణ ప్రజల పొదుపు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. అంతేకాదు సాధారణ గృహస్థులకు తమ పొదుపు, పెట్టుబడులను వైవిధ్యపరుచుకునే వీలు కలిగిందని' పేర్కొంది. సంప్రదాయ పొదుపు మార్గాల నుంచి భారతీయులు ఆధునిక పొదుపు, పెట్టుబడి మార్గాల వైపునకు మళ్లి, మెరుగైన రాబడిని సంపాదిస్తున్నారని తెలిపింది. ఇది సాధారణ ప్రజల్లో ఆర్థిక వనరులపై పెరుగుతున్న అవగాహనను సూచిస్తోందని పేర్కొంది.