India Badminton Olympics:పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు నిరాశే మిగిలింది. ఈ ఏడాది మన షట్లర్లు గట్టిగా పోరాడినప్పటికీ ఎవరూ పతకాన్ని సాధించలేకపోయారు. రీసెంట్గా యంగ్ షట్లర్ లక్ష్యసేన్ కాంస్యం పోరులో జెడ్ జే లీ (మలేసియా)పై 21-13, 16-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.
12 ఏళ్లలో తొలిసారి
కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ ఓటమితో పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత షట్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. 2008 తర్వాత ఒలింపిక్స్ లో భారత్ బ్యాడ్మింటన్ పతకాన్ని సాధించలేకపోవడం ఇదే తొలిసారి. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది. మరో స్టార్ షట్లర్ పీవీ సింధు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఏకంగా రజతం దక్కించుకొని సత్తాచాటింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో సింధు కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో వరుసగా మూడు ఒలింపిక్స్ ల్లోనూ భారత్ బ్యాడ్మింటన్ ఈవెంట్ల్లో ఏదో ఒక పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
అయితే 2024 పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం భారత్‌కు నిరాశ తప్పలేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు సింగిల్స్‌లో నిరాశ పర్చింది. హ్యాట్రిక్ మెడల్ సాధిస్తుందనుకున్న సింధు ప్రీ క్వార్టర్స్‌లో వెనుదిరింది. కాగా, 22ఏళ్ల లక్ష్యసేన్ సంచలన ప్రదర్శనతో పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్ దూసుకొచ్చి ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచాడు. పతకం సాధిస్తే మరో రికార్డు సాధించేవాడు. కానీ దానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ ను పోరాడి ఓడిపోయాడు.