IND W vs PAK W World Cup 2024 :2024 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా రెండో పోరుకు సిద్ధమైంది. భారత్ తన రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం (అక్టోబర్ 06) తలపడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు దుబాయ్ స్టేడియం వేదిక కానుంది. అయితే తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో భంగపడ్డ టీమ్ఇండియా, దాయాది దేశం పాక్‌ను ఓడించి టోర్నీలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.
ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమ్ఇండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కానీ, టోర్నీలో ఇప్పటికే బోణీ కొట్టిన పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్‌లో ఆకట్టుకోకపోయినా, బౌలింగ్‌తో ఎటాక్ చేసి నెగ్గింది. శ్రీలంకతో మ్యాచ్‌లో కట్టుదిట్టమైన ఫీల్డింగ్, నాణ్యమైన బౌలింగ్‌తో విజయం సాధించింది. అదే జోష్‌లో టీమ్ఇండియాపై కూడా నెగ్గి సెమీస్‌కు చేరువవ్వాలని పాక్ భావిస్తోంది. అటు సెమీస్ రేసులో ఉండాలంటే పాక్‌పై భారత్ తప్పక నెగ్గాల్సి ఉంటుంది.
ఒత్తిడిలో భారత్!
అయితే ఈ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. కివీస్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తడబడింది. ఫలితంగా 58 పరుగుల తేడాతో ఓడింది. గత కొన్ని రోజులుగా టీమ్ఇండియా టాపార్డర్ ఆశించినమేర రాణించడం లేదు. ఇకనైనా ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్‌లోకి రావాలి. ఇక టీమ్ఇండియా బౌలింగ్ లైనప్‌పై కూడా దృష్టి సారించాల్సి ఉంది. వీక్‌గా ఉన్న పాక్ బ్యాటింగ్‌ను టీమ్ఇండియా బౌలింగ్‌తో ఎటాక్ చేస్తే విజయం సాధించవచ్చు.
మరోవైపు, పాకిస్థాన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే లంకను చిత్తు చేసి రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే జోరును కొనసాగించి టీమ్ఇండియాపై నెగ్గాలని తహతహలాడుతోంది. కానీ, భారత్‌ను ఓడించడం పాక్‌కు అంత ఈజీ కాదు. పైగా ఐసీసీ ఈవెంట్లలో పాక్‌పై భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. గత రికార్డులు చూస్తే పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది.