IND VS SL 1st ODI:శ్రీలంక పర్యటనలో శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 50ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం 231 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 47.5 ఓవర్లలోనే 230 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ (58; 47 బంతుల్లో, 7x4, 3x6) రాణించాడు. అయితే గేమ్ డ్రా అవ్వడం వల్ల సూపర్ ఓవర్ లేకుండానే మ్యాచ్ ముగిసింది. ఎందుకో తెలుసా?
క్రికెట్లో ఇరుజట్ల స్కోర్లు సమమైనప్పుడు మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా ఇదే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసింది. ఎందుకంటే? అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిబంధనల ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వన్డే మ్యాచ్ డ్రా అయితే ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించరు. కానీ, ఐసీసీ టోర్నమెంట్స్ వన్డే ఫార్మాట్లలో జరిగితే మాత్రం అప్పుడు ఫలితం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అందుకే భారత్- శ్రీలంక తొలి వన్డేకు సూపర్ ఓవర్ జరగలేదు. అయితే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీ20 సిరీస్‌కు మాత్రం ఈ రూల్ వర్తించదు. పొట్టి ఫార్మాట్లో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు.
అయితే ఈ మ్యాచ్‌ను టీమ్ఇండియా చేజేతులా పోగొట్టుకుందనే చెప్పాలి. ఓ మోస్తారు లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 12.4 ఓవర్లలో 75పరుగులు జోడించారు. గిల్ (16పరుగులు) నిరాశ పర్చినా, రోహిత్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం విరాట్ (24 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (23 పరుగులు) విఫలమయ్యారు. దీంతో 132 పరుగులకు భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (31 పరుగులు), అక్షర్ పటేల్ (33 పరుగులు), శివమ్ దూబే (25 పరుగులు) పోరాడారు.