IND VS NZ 3rd Test Harshit Rana : భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉంది న్యూజిలాండ్. బెంగళూరు, పుణెలో జరిగిన రెండు టెస్టుల్లోనూ విజయఢంకా మోగించింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడో టెస్ట్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. దీంతో వాంఖడే వేదికగా జరిగే మూడో టెస్టులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమ్ ఇండియా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టులోకి స్టార్ పేస్ బౌలర్ హర్షిత్ రాణాను తీసుకుందట. హుటాహుటిన అతన్ని ముంబయికి పిలిపించుకుని, జట్టుతో చేరాల్సిందిగా సూచించిందట
కివీస్‌తో సిరీస్‌కు హర్షిత్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. అయితే, రంజీ ట్రోఫీలో అసాంతో మ్యాచ్ కోసం జట్టు నుంచి రిలీజ్ అయ్యాడు. దిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించిన హర్షిత్ అసాం జట్టుపై అదరగొట్టాడు. ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు కోసం హర్షిత్‌ను భారత జట్టులో భాగం చేశారు. ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టి హర్షిత్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ హర్షిత్‌కు కివీస్‌తో జరగబోయే మూడో టెస్టులో తుదిజట్టులో చోటు దక్కితే అతడి అరంగేట్ర మ్యాచ్ అదే అవుతుంది.
కేకేఆర్ విజయంలో కీలక పాత్ర - ఎదురుగా ఎంతటి దిగ్గజ బ్యాటర్ ఉన్నా, పదునైన వేగంతో బంతులు వేసి వికెట్లు పడగొట్టడంలో హర్షిత్ రాణా దిట్ట. కీలక సమయాల్లో ఒత్తిడిని జయించి టీమ్‌కు విజయాలు అందించడంలో 22 ఏళ్ల ఈ దిల్లీ కుర్రాడు ముందుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో హర్షిత్ ది కీలక పాత్ర. 11 ఇన్నింగ్స్‌ల్లో 20.15 సగటుతో 19 వికెట్లు సాధించాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక -ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు జట్టులో ఉన్నప్పటికీ అరంగేట్రం చేసే అవకాశం హర్షిత్‌కు రాలేదు. నవంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి హర్షిత్ ఎంపికయ్యాడు. హర్షిత్ ప్రతిభపై నమ్మకముంచిన కోచ్ గౌతమ్ గంభీర్ అతనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 6.2 అడుగుల ఎత్తు ఉండే హర్షిత్ 140 కిలోమీటర్ల వేగంతో విసిరే బౌన్సర్లను ఆడటం బ్యాటర్లకు సవాలుగా ఉంటుంది. అలాగే పిచ్ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని తగ్గించుకుని వైవిధ్యంతోనూ హర్షిత్ బ్యాటర్లను బోల్తా కొట్టించగలడని చాలాసార్లు నిరూపించుకున్నాడు.