IND VS AUS 3rd Test Google : బ్రిస్బేన్, గబ్బాలో జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ మూడో టెస్టు ఆసక్తికర చర్చలకు వేదికవుతోంది. నేడు మంగళవారం (డిసెంబర్ 17) టీమ్ ఇండియా ఫాలో ఆన్ నుంచి బయటపడిన తీరు, రాహుల్, జడేజా బ్యాటింగ్, బుమ్రా- ఆకాశ్ దీప్ పార్ట్‌నర్‌షిప్ గురించి అందరూ తెగ చర్చించుకుంటున్నారు. దీంతో పాటే సోమవారం మూడో రోజు ఆట ముగిశాక మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు బుమ్రా ఇచ్చిన సమాధానం కూడా తెగ ట్రెండ్ అవుతోంది. అయితే తాజాగా బుమ్రా రియాక్షన్‌పై గూగుల్ ఇండియా కూడా స్పందించింది.
ఓ రిపోర్టర్ 'హాయ్, జస్ప్రీత్. బ్యాటింగ్‌పై మీ అంచనా ఏంటి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు మీరు సరైన వ్యక్తి కాదు. అయినా గబ్బాలో పరిస్థితులను ఆధారంగా చూస్తే జట్టు పరిస్థితి గురించి ఏమనుకుంటున్నారు?' అని ప్రశ్నించాడు. దీనికి బుమ్రా స్పందిస్తూ, 'ఇది ఆసక్తికరమైన ప్రశ్న. కానీ మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఓసారి గూగుల్ చేసి, టెస్టుల్లో ఒకే ఓవర్లో ఎవరు ఎక్కువ పరుగులు చేశారో చూడాలి. కానీ జోకులు వేరు. అది వేరే కథ.' అని చెప్పాడు. 2022లో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో బుమ్రా ఏకంగా 35 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
గూగుల్ ఇండియా రియాక్షన్
తాజాగా గూగుల్ ఇండియా బుమ్రా వ్యాఖ్యలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో స్పందించింది. ఒక పోస్ట్‌లో 'నేను జస్సీ భాయ్‌ని మాత్రమే నమ్ముతాను (I only believe in Jassi Bhai)' అని క్యాప్షన్ రాసి, బుమ్రా మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బుమ్రా రెండోసారి ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. ఇప్పటి వరకు 18 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆసీస్ పిచ్‌లపై బుమ్రా మాట్లాడుతూ, "నాకెప్పుడైనా విభిన్న సవాళ్లంటే ఇష్టం. పెర్త్‌లో వికెట్ ఒకలా, అడిలైడ్‌లో మరొకలా స్పందించింది. ఇప్పుడు గబ్బాలో ఇంకోలా ఉంది. భారతదేశంలో మేము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. అలవాటు పడలేదు. కాబట్టి ఇది ఒక ఆసక్తికరమైన సవాలుగా. ఈ సవాళ్లను ఇష్టపడతా. ప్రధాన బౌలర్‌గా తోటి బౌలర్లకు సాయపడటమే నా పని." అని పేర్కొన్నాడు.
'దేవా ఇంతకన్నా నేనేం చేయాలి' - ఆ విషయంపై పృథ్వీ షా అసహనం!
కేఎల్ రాహుల్ దూకుడు - కోహ్లీ, రోహిత్, పంత్ కన్నా అతడే బెటర్