Australian Open 2025 : 2025 ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓటమి బాధలో ఉన్న రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన మెద్వెదెవ్‌కు నిర్వాహకులు 76వేల డాలర్ల ఫైన్ విధించారు. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.44 లక్షలు. మైదానంలో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినందుకుగాను అతడికి జరిమానా విధించినట్లు టోర్నీ నిర్వాహకులు తెలిపారు. మరి అతడు ఏం చేశాడంటే?
టోర్నీ తొలి రౌండ్లో 418 ర్యాంక్ కసిడిట్ సమ్రేజ్పై మెద్వెదెవ్ విజయం సాధించాడు. ఈ ఆనందంలో అతడు తన రాకెట్‌తో పలు మార్లు నెట్ కెమెరాను బాదుతూ దాన్ని ధ్వంసం చేశాడు. దీంతో నిర్వాహకులు అతడిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. తొలి తప్పిదం కింద భావించిన నిర్వాహకులు ఇది మళ్లీ జరగకూడదని హెచ్చరించి అతడికి 10వేల డాలర్లు ఫైన్ విధించారు.
ఇక రెండో రౌండ్లో 19 ఏళ్ల అమెరికా ప్లేయర్ టిన్ లీనర్ను ఢీ కొట్టిన మెద్వెదెవ్ ఓటమిపాలయ్యాడు. ఈ గేమ్‌లో 6-3, 7-6 (4), 6-7 (10), 1-6, 7-6 (7) తేడాతో ఓడిపోయాడు. దీంతో మెద్వెదెవ్ ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. మైదానంలో ఇష్టారీతిన ప్రవర్తిస్తూ రాకెట్‌ను నెట్ వాల్కేసి బాదాడు. ఈ క్రమంలోనే మరోసారి కెమెరాలు ధ్వంసం చేశాడు. దీంతో అతడిపై మరోసారి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నిర్వాహకులు ఈసారి ఏకంగా 66వేల డాలర్లు ఫైన్ విధించారు. దీంతో మొత్తం అతడిపై 76వేల ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా పడింది.
Daniil Medvedev was fined $76,000 at this year’s Australian Open.
— The Tennis Letter (@TheTennisLetter) January 18, 2025
$10k for hitting the camera with his racquet during the 1st round.
$66k for his behavior during his match against Tien & not attending press.
His total winnings were $124k.
pic.twitter.com/bDQ4aj064j
కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇప్పటివరకు మెద్వెదెవ్ మూడుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు. అలాగే 2023, 2024లో సెమీస్‌దాకా వెళ్లాడు. ఈసారి ఎలాగైన టైటిల్ దక్కించుకోవాలన్న కలితో బరిలోకి దిగాడు. కానీ, రెండో రౌండ్లోనే అతడికి నిరాశ ఎదురైంది.