Best Parenting Tips To Raise A Happy Child : డిజిటల్ కాలంలో పిల్లలను చదువులు, ఇతర అంశాల్లో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. మరోవైపు పెరుగుతున్న ఖర్చులతో తల్లిదండ్రులిద్దరూ జాబ్స్ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎదుగుతున్న పిల్లల బాగోగులు అన్నీ పూర్తి స్థాయిలో చూసుకునేందుకు టైం కేటాయించలేని దుస్థితిని ఎక్కువ శాతం మంది ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా చాలా మంది బాలబాలికలు చదువుల్లో రాణిస్తున్నా మానసిక, శారీరక ఆరోగ్య పరంగా కుంగుబాటుకు గురవుతున్నారని మనోవిజ్ఞాన నిపుణులు అంటున్నారు. 10 నుంచి 15 సంవత్సరాలలోపు వయసు ఉన్న చిన్నారులకు కొన్ని ముఖ్యమైన అలవాట్లు అలవర్చడంతో అన్ని విధాలా ఆరోగ్యంగా తీర్చిదిద్దవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
సూర్యోదయానికి ముందే నిద్రలేవడం : ముఖ్యంగా స్టూడెంట్స్ సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున మెదడులో సెరటోనిల్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవిస్తుంది. దీంతో జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఆ సమయంలో ఏం చదివినా, రాసినా జ్ఞాపకం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
నోటిని క్లీన్ చేసుకోవాలి : రోజుకు రెండు మార్లు బ్రష్ చేసుకోవడం, ఏదైనా తిన్న తరువాత నోటిని నీటితో బాగా పుకిలించి శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా ఆహారాన్ని బాగా నమిలి తినాలి. నోటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడంతో దుర్వాసన, దంత సమస్యలు రాకుండా ఉంటాయి.
చన్నీళ్ల స్నానం మంచిది : సాధారణంగా చిన్న పిల్లలకు చన్నీళ్ల స్నానమే మంచిది. శీతాకాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయించడం మేలు. తల స్నానం చన్నీళ్లతోనే చేయాలి. వేడి నీళ్లతో చేయడంతో నాడీ కణాల ఉత్తేజం తగ్గుముఖం పడుతుంది. 13 శాతం మంది పిల్లలు చర్మ రుగ్మతలతో ఇబ్బంది పడటానికి వేడి నీళ్ల స్నానమే కారణమని వైద్యులు అంటున్నారు. నాడీకణాలు ఉద్రేకంగా ఉంటే పిల్లల వయసు ప్రకారం రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది.
పౌష్టికాహారం - మంచి నీరు ముఖ్యం : చిన్న పిల్లలను చిరుతిండిని దూరం చేసి పౌష్టికాహారానికి అలవాటు చేయాలి. అలాగే రోజులో తగినంత నీరు తాగేలా చూడాలి. స్కూల్లో విశ్రాంతి, సాయంత్రం సమయంలో వీలు దొరికినప్పుడల్లా ఓ గ్లాసు నీరు తాగేలా చూడాలి. భోజనం చేస్తున్నప్పుడు, వెంటనే గానీ నీరు అధికంగా తీసుకుంటే జీర్ణరసాలు పలుచబడి జీర్ణక్రియ ఆలస్యం అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
భోజనం - త్వరగా నిద్ర : విద్యారంగంలో పెరిగిన పోటీతో పిల్లలను రాత్రి 9, 10 గంటల వరకు చదివిస్తున్న తల్లిదండ్రులు చాలా మందే ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు భోజనం పెట్టాలి. ఆ తరువాత ఒకటి రెండు గంటలు చదువు, హోం వర్క్ పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలి. రాత్రి 9 గంటల కల్లా నిద్రపోయేలా అలవాటు చేయాలి. తద్వారా తెల్లవారుజామున నిద్ర లేస్తారు.
నేలపై కూర్చొని తినడం : ఇంట్లో భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చొని తినడం ఒక యోగాసనం లాంటిది. దీంతో చిన్న పిల్లల్లో అన్ని నాడులు చక్కగా పని చేస్తాయి. శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంతే తినేందుకు ఆస్కారం ఉంటుంది. భుక్తాయాసం ఉండకపోగా, భోజన టైంలో శ్వాస ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.
రోజూ ఒక గంటైనా ఆటలు : 5 నుంచి 15 సంవత్సరాలలోపు బాలబాలికలు ఈవినింగ్ కనీసం ఒక గంట అయినా శారీరక వ్యాయాయం ఉండే ఆటలు ఆడే విధంగా చాడాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కదలికలు లేకుండా తరగతులకు పరిమితం అయ్యే స్టూడెంట్స్కు చక్కగా ఓ గంటసేపు ఇష్టమైన ఆటలు ఆడుకునే అవకాశం ఇవ్వాలి. దీంతో మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు పోటీతత్వం, చురుకుదనం పెరిగేందుకు వీలు ఉంటుంది.
చిన్న చిట్కాలతో ఎంతో మేలు : తల్లిదండ్రులు చిన్నచిన్న చిట్కాలతో మంచి అలవాట్లు అలవరుస్తూ పిల్లలను ఆరోగ్యంగా తీర్చిదిద్దవచ్చని, త్వరగా నిద్ర లేవాలంటే ముందు రోజు రాత్రి త్వరగా పడుకునేలా చూడాలని నాంపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ ఇస్రాత్ ఉన్నిసా తెలిపారు. వెకువజామున మైండ్ చురుగ్గా ఉండటంతో చదివిన అంశం బాగా గుర్తుంటుందని, నీరు బాగా తాగడంతో రక్త శుద్ధి జరిగి హుషారుగా ఉండేందుకు ఉపకరిస్తుందని అన్నారు. సాయంత్రం కాసేపు చెమటలుపట్టేలా ఆటలు ఆడుకోవడంతో కండరాలు ఉద్దీపనం చెంది , మానసిక ఆరోగ్యమూ మెరుగవుతుందని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లలు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలంటే - అయితే మీరు ఇలా చేయాల్సిందే!