IND vs NZ 3rd Test 2024 :భారత్ - న్యూజిలాండ్ మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే మూడో రోజు వీలైనంత త్వరగా కివీస్‌ను ఆలౌట్ చేసి లక్ష్యం 150 పరుగులలోపు ఉండేలా చూసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఇక టీమ్ఇండియాకు ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు.
కానీ, మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న వాంఖడే పిచ్ స్పిన్‌కు స్వర్గధామంగా మారింది. బంతి గింగిరాలు తిరుగుతోంది. మూడో రోజు బంతి మరింత స్పిన్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకుల మాట. ఈ క్రమంలో టెస్టుల్లో వాంఖడేలో పిచ్‌పై ఆత్యధిక లక్ష్య ఛేదన ఎంత? ఏ జట్టు నెగ్గింది. తెలుసుకుందాం!
- వాంఖడే వేదికగా టెస్టుల్లో అత్యధిక ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2000 ఫిబ్రవరిలో భారత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 63 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
- 1980లో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌కు భారత్ 96 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ని ఇంగ్లాండ్ 29.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండానే ఛేదించింది.
- 2012 నవంబర్‌లో టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 58 పరుగుల టార్గెట్‌ని 58 బంతుల్లో అందుకుంది
- 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. 48 పరుగుల లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో ఛేదించింది.
- 2001 ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 47 పరుగుల టార్గెట్‌ని 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది.