Ind vs Nz 1st Test 2024 :భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌటై, కివీస్‌కు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో దిగిన కివీస్ నాలుగు బంతులు ఎదుర్కోగానే, మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో ప్లేయర్లు గ్రౌండ్‌ను వీడారు. సిబ్బంది మైదానాని కవర్లతో కప్పి ఉంచింది. అంపైర్లు నాలుగో రోజు ఆట ముగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కివీస్ 0-0 స్కోర్‌తో ఉంది. ప్రస్తుతం క్రీజులో టామ్ లేథమ్ (0), డేవన్ కాన్వే (0) ఉన్నారు.
కాగా, రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 462 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ (150 పరుగులు; 195 బంతుల్లో 18x4, 3x6) భారీ శతకం బాదాడు. రిషభ్ పంత్ (99 పరుగులు; 105 బంతుల్లో 4x4, 5x6) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ (70 పరుగులు), రోహిత్ (52 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
62 పరుగులకే 7 వికెట్లు
ఒక దశలో 400/3తో పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియా ఆ తర్వాత టపటపా వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్ ఖాన్ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. 408 పరుగుల వద్ సర్ఫరాజ్ ఔటవ్వగా, 25 పరుగుల వ్యవధిలో పంత్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక కేఎల్ రాహుల్ (12 పరుగులు), రవీంద్ర జడేజా (5 పరుగులు), అశ్విన్ (15 పరుగులు) నిరాశపర్చారు. దీంతో టీమ్ఇండియా 62 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లు నష్టపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, విలియం 3, అజాజ్ పటేల్ 2, టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ చెరో వికెట్ పడగొట్టారు.