Bhu Bharati Bill : సాగు భూముల రిజిస్ట్రేషన్లు - మ్యుటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో ఇక నుంచి భూభారతి రానుంది. ఇందుకు సంబంధించిన ఆర్వోఆర్-2024 బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లుకు శుక్రవారమే శాసనసభ ఆమోదం తెలపగా, శనివారం శాసనమండలిలో చర్చించిన అనంతరం ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీంతో అది గవర్నర్ ఆమోదం కోసం వెళ్లనుంది. ఆయన ఆమోదముద్ర వేయగానే చట్టం అమల్లోకి వస్తుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. దాని స్థానంలో కొత్త పోర్టల్‌ను తీసుకొస్తామని చెప్పి భూభారతి పోర్టల్ ఏర్పాటు ప్రక్రియలను పూర్తి చేసింది. ఈ ఏడాది జనవరి 9న ఐదుగురు సభ్యులతో కూడిన ధరణి కమిటీ పలు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేసింది. అలాగే వివిధ శాఖలతో సమీక్షల అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అనంతరం ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం 18 రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో ఆర్వోఆర్ -2020 చట్టాన్ని రూపొందించిన నిపుణులతో వారు సమావేశం అయ్యారు
ఈ క్రమంలో నిపుణుల కమిటీ రాష్ట్రంలోని రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు చరమగీతం పాడేందుకు అవసరమైన అన్ని రకాల సెక్షన్లను చట్టంలో చేర్చేందుకు ప్రణాళిక రచించి నిర్ణయించింది. ఆగస్టులో డ్రాప్ట్‌ను సిద్ధం చేసి వివిధ వర్గాల సలహాలు, అభిప్రాయాలు స్వీకరించారు. ఈ చట్టంపై దాదాపు 11 నెలల పాటు నిపుణులు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. చివరికి 21 సెక్షన్లతో డ్రాప్ట్‌ను సిద్ధం చేయగా.. వాటిలో 19 సెక్షన్లు వివిధ క్లాజులకు సంబంధించినవే.
కొత్త అంశాలకూ ఈ చట్టంలో అవకాశం : నూతన రెవెన్యూ చట్టంలో పలు అంశాలను చేర్చాలంటూ అధికార, విపక్ష ఎమ్మెల్యేలు సభల్లో చర్చలు సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అందుకు రెవెన్యూ మంత్రి అంగీకారం తెలిపారు. అలాగే ఆర్వోఆర్-2024లో కొత్త సెక్షన్లు చేర్చేందుకు ఉన్న ఐచ్ఛికాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇందులో
- జిల్లాల స్థాయిలోనే సమస్యల పరిష్కారం
- రెండు దశల్లో అప్పీళ్ల వ్యవస్థ
- ల్యాండ్ ట్రైబ్యునళ్ల ఏర్పాటు
- సాదాబైనామాల క్రమబద్ధీకరణ
- వారసత్వ బదిలీ మ్యుటేషన్ల సమయంలో విచారణ ప్రక్రియ
- ఆబాదీ భూములకు హక్కుల కల్పన
ఇలాంటి తదితర కీలక అంశాలకు కొత్త చట్టంలో స్థానం కల్పించారు. ఈ చట్టం రూపకల్పనలో కీలక భూమిక పోషించిన భూమి చట్టాల నిపుణుడు సునీల్‌కుమార్‌ను శనివారం పలువురు అభినందించారు. గవర్నర్ ఆమోదం లభించగానే భూభారతి చట్టం రూపుదాల్చుకోనుంది.
భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదం - రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్న సీఎం
'ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేదు - కానీ భూ భారతిలో వివరాలు అన్నీ ఉంచుతాం'