Best Sleeping Positions to Reduce Stress : మన రోజువారీ జీవితంలో పలు సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఒత్తిడి, ఆందోళనలకు గురవడం సహజమే. ఇవే కాకుండా నిద్రలేమి కూడా ఒత్తిడికి ఓ కారణం అన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. సుఖంగా నిద్ర పట్టకపోవడానికి మనం పడుకునే కొన్ని రకాల భంగిమలే కారణమంటున్నారు నిపుణులు. ఈ భంగిమల్లో పడుకోవడం వల్ల శరీరంలోని ఆయా భాగాలపై ప్రతికూల ప్రభావం పడి.. నిద్రలేమికి, దాంతో మానసిక ఒత్తిడికి దారితీస్తుందని చెబుతున్నారు. మరి, ఇంతకీ ఏయే భంగిమల్లో పడుకోకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కారణం ఇదే: మనం నిద్రపోయినప్పుడే బాడీ రిలాక్సవుతుంది. ఈ క్రమంలో శరీర అవయవాలన్నీ రిపేరై పునరుత్తేజితమవుతాయి. ఇంతవరకు బానే ఉన్నా ఒక్కోసారి నిద్ర లేచే సరికి కొన్ని భాగాల్లోని కండరాలు పట్టేస్తుంటాయి. దీనికి కారణం మనం పడుకున్న స్లీప్ పొజిషన్సే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే కండరాలు పూర్తి స్థాయిలో రిలాక్స్ కాకపోవడంతో పాటు.. ఈ నిద్రా భంగిమల వల్ల మధ్యలో మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, తద్వారా ఒత్తిడికి లోను కావడం.. వంటివి జరుగుతాయంటున్నారు.
ఇలా పడుకుంటున్నారా?
- కొంతమంది ముడుచుకొని పడుకుంటారు. అంటే ఓ పక్కకు తిరిగి, కాళ్లు రెండూ పొట్ట దగ్గరికి తీసుకొచ్చి నిద్ర పోతుంటారు. అయితే ఇలా నిద్రించడం వల్ల శ్వాస వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అలాగే వీపు, మెడ వద్ద అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నిద్రకు అంతరాయం ఏర్పడి ఒత్తిడి ఎదురవుతుందంటున్నారు.
- బోర్లా పడుకునే వారు చాలామందే. దీనివల్ల మెడ, వీపు కింది భాగంలో ఒత్తిడి పడుతుందని.. అలాగే ఈ భంగిమలో మెడను ఒక వైపుకి తిప్పి పడుకుంటాం కాబట్టి మెడనొప్పి వేధిస్తుందని.. ఇదీ నిద్రలేమి, ఒత్తిడికి కారణమవుతుందంటున్నారు.
- ఇక కొంతమంది వెల్లకిలా పడుకున్నా.. చేతులు, కాళ్లు చాచి పడుకుంటారు. దీన్నే ‘స్టార్‌ఫిష్ పొజిషన్’ అంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు పడుకున్నా చేతులు, కాళ్లలోని కండరాలు పట్టేసే ప్రమాదం ఉంటుందని.. అంతేకాకుండా.. ఈ భంగిమ గురక రావడానికీ కారణమవుతుందంటున్నారు. దీనివల్ల కూడా నిద్రకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు.
- ఏదైనా ఓ పక్కకి తిరిగి పడుకున్నా.. చేతులు పూర్తిగా చాచి నిద్రపోతుంటారు కొంతమంది. అయితే ఈ భంగిమ మెడ, భుజాల్లో అసౌకర్యానికి కారణమవుతుందని.. కాబట్టి ఒత్తిడి ఎదురవకుండా ఉండాలంటే ఈ భంగిమ మంచిది కాదంటున్నారు.
ఏ పొజిషన్స్ బెస్ట్ అంటే:
- నిద్ర సరిగ్గా పట్టాలన్నా, ఒత్తిడి సహా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నా సరైన నిద్ర భంగిమ ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే సాధారణంగా పక్కకు తిరిగి లేదంటే వెల్లకిలా పడుకోవడం మంచిదంటున్నారు. అయితే ఇలా నిద్రపోయినప్పుడు చేతులు, కాళ్లు చాచి కాకుండా.. నిటారుగా ఉండేలా చూసుకోమంటున్నారు. దీనివల్ల వెన్నెముకపై ఒత్తిడి పడకుండా చక్కటి సపోర్ట్ అందుతుందని.. ఫలితంగా ఆయా శరీర భాగాల్లోని కండరాలు రిలాక్సవుతాయంటున్నారు.
- అయితే గర్భిణులకు ఈ భంగిమ సరికాదంటున్నారు నిపుణులు. వీళ్లు ఓ సైడ్కు తిరిగి, కాళ్లు కాస్త ముడుచుకొని పడుకోవడం మంచిదంటున్నారు. దీనివల్ల పొట్టపై ఒత్తిడి పడకుండా ఉంటుందని.. కావాలంటే కాళ్ల మధ్యలో దిండు పెట్టుకుంటే మరింత సౌకర్యంగా అనిపిస్తుందని చెబుతున్నారు. అలాగే గర్భాశయానికి, ఎదిగే శిశువుకు, గుండె-మూత్రపిండాలకు రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుందంటున్నారు. ఇక గర్భిణులతో పాటు గురకతో ఇబ్బంది పడే వారికి, వృద్ధులకు.. ఈ భంగిమ మేలు చేస్తుందని చెబుతున్నారు.
- మెడ నొప్పితో బాధపడుతుంటారు కొందరు. అలాంటి వారు వెల్లకిలా పడుకున్నా, పక్కకు తిరిగినా.. తల-భుజాలు సమాంతరంగా ఉండేలా మెడ వద్ద దిండు పెట్టుకోవాలని. ఫలితంగా ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు.
- ఇక వీపు నొప్పితో బాధపడే వారు పక్కకు తిరిగి పడుకోవడం మేలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాళ్లు నిటారుగా చాపినా, కాస్త ముడుచుకున్నా.. కాళ్ల మధ్యలో దిండు పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు. ఓ అధ్యయనంలో, వెన్నునొప్పి ఉన్న పెద్దలు వెల్లకిలా లేదా పక్కకు తిరిగి పడుకోవడం వల్ల వారు కేవలం నాలుగు వారాల్లో నొప్పి నుంచి ఉపశమనం పొందారని అంటున్నారు. అలాగే ఈ విషయాన్ని స్లీప్ ఫౌండేషన్ వెబ్సైట్లో ప్రచురించారు(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు మిలిటరీ స్లీప్ ట్రిక్ తెలుసా? ఇలా చేస్తే జస్ట్ రెండు నిమిషాల్లో గాఢంగా నిద్రపోతారట!
మీకు 3-2-1 స్లీప్ రూల్ తెలుసా? ఇది పాటిస్తే హాయిగా నిద్రపోతారట!