Kommaigudem Most Of Villagers Are Working As Drivers : కొన్ని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగించడం చూసుంటాం. కొన్ని గ్రామాల్లో ఎలాంటి ఆసరా లేకపోతే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవీ చూశాం. కానీ ఈ గ్రామస్థులు మాత్రం వాళ్లే ఉపాధి అవకాశాలు కల్పించుకుని, వారు ఉపాధి పొందటమే కాకుండా మరికొందరికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. మరి ఆ గ్రామం ఏదో, దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్గొండ జిల్లా కొమ్మాయిగూడెం రామన్నపేటకు కూత వేటు దూరంలో ఉంటుంది. ఈ గ్రామ పరిసరాల్లో జీవనోపాధి అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో స్వయం ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించారు గ్రామవాసులు. గ్రామంలో డ్రైవర్లుగా జీవనోపాధి పొందుతున్న తీరును చూసి తాము సైతం ఎందుకు కాకూడదనుకున్నారో ఏమో కానీ ఒకరి వెంట మరొకరు డ్రైవరుగా శిక్షణ పొంది ఇదే వృత్తిని జీవనోపాధిగా ఎంచుకున్నారు. ఇలా కొందరు డ్రైవర్లుగా జీవనం సాగిస్తుంటే, మరికొందరు సొంత వాహనాలు కొని మరికొంత మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.
ఆ ఊరంతా లారీలే - 100 మందికి పైగా డ్రైవర్లే - Lorry Families Story in Narayanpur
దాదాపు డ్రైవర్లుగా జీవనం : కొమ్మాయిగూడెం గ్రామ జనాభా 1250 కాగా, కుటుంబాల సంఖ్య 519. వీరిలో చాలా మంది డ్రైవర్ వృత్తిగా జీవనోపాధి పొందుతున్న వారే కనిపిస్తారు. ఆటోలతో పాటు టాటా సుమో, టవేరా, తుపాన్, లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలు వంటి అనేక వాహనాలు ఇక్కడ కన్పిస్తాయి. వీటిని అద్దెకు నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తుంటారు. మరికొందరు హైదరాబాద్ వంటి తదితర ప్రాంతాలకు వెళ్లి డ్రైవర్లు నెలకు రూ.15 వేలకు పైదా ఆదాయం పొందుతున్నారు. ఈ గ్రామంలోని లారీ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్‌లో సభ్యుల సంఖ్య 70 మందికి పైమాటే.
గ్రామంలో కాకుండా బయటి ప్రాంతాల్లో మరో 30 మందికి పైగా లారీ డ్రైవర్లుగా పని చేస్తుంటారు. ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎం తదితర వాహనాలకు సంబంధించిన మరో 80 మందికి పైగా డ్రైవర్లు ఉన్నారు. మొత్తంగా డ్రైవర్ వృత్తిపై జీవనం సాగిస్తున్న వారు మొత్తం 180 మంది వరకు ఉంటారు. ఇలా కొమ్మాయిగూడెం ప్రత్యేకత చాటుకుంటోంది.