Young Man Murdered After Love Marriage In Hyderabad : ప్రేమకు కులం, మతం, ప్రాంతాలతో సంబంధం ఉండదు. కానీ కొంత మంది తల్లిదండ్రులు తమ పరువు ఎక్కడపోతుందో అని ప్రేమికులను విడదీస్తున్నారు. తాజాగా తమ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో పెళ్లి జరిపిస్తానని నమ్మించి ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లి అలీ కాంప్లెక్స్ సమీపంలో నివసించే మహమ్మద్ సమీర్ (25) వెల్డింగ్ పని చేస్తుండే వాడు. గత సంవత్సరం నాచారంలో ఓ భవనానికి సంబంధించి వెల్డింగ్ పని చేయడానికి వెళ్లిన సమీర్, ఆ భవన యజమాని కుమార్తెను ప్రేమించాడు. అలా ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో ఆ అమ్మాయిని అస్సాంకు తీసుకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అక్కడే 20 రోజుల పాటు ఉన్నారు.
పెళ్లి చేస్తామని పిలిచి హత్య : ఈ వివాహం గురించి అమ్మాయి కుటుంబసభ్యులకు తెలిసింది. ఈ వివాహం ఇష్టపడని అమ్మాయి తల్లిదండ్రులు వారికి ఇక్కడే ఘనంగా వివాహం చేయిస్తామని నమ్మించి నగరానికి వచ్చేలా చేశారు. అనంతరం అమ్మాయిని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆమెకు ఇటీవల మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. ఇది తెలుసుకున్న సమీర్ అడ్డుకునే ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కత్తులు, సర్జికల్ బ్లేడ్లతో హత్య : ఈ నెల 21న అర్ధరాత్రి సమయంలో సమీర్ ఇంటి బయట కూర్చుని ఉన్నాడు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది దుండగులు కత్తులు, సర్జికల్ బ్లేడ్లతో సమీర్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి చంపారు. ఈ దుండగుల్లోని ఒకరి కత్తికి సంబంధించిన కవర్ పోలీసులకు దొరికింది. దుండగులు మాస్కులు ధరించి ఉన్నారని, ప్రతిఘటించిన సందర్భంలో తమపైనా దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
డీసీపీ సాధనా రేష్మీ పెరుమాళ్, ఏసీపీలు కృష్ణమూర్తి, సర్దార్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన కొద్దిసేపటికే అమ్మాయి కుటుంబసభ్యులు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిన నేపథ్యంలో వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య - ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను కొట్టి చంపిన తల్లి