రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత జట్టుపై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో గెలుపొందింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. దీంతో మ్యాచ్ ఇంగ్లిష్ జట్టు వశమైంది. అయితే భారత జట్టు సుమారు 426 రోజుల తర్వాత స్వదేశంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. అంతకుముందు 2023 నవంబర్ 28న గువాహటిలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. అయితే ఈ స్టోరీలో మూడో టీ20లో టీమ్ ఇండియా ఓటమికి గల ఐదు కారణాలను తెలుసుకుందాం.
షమీ పేలవ ఫామ్
టీమ్ఇండియా పేసర్ షమీ 436 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మూడో టీ20లో అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో షమీ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్నాడు. అయితే తన ఇన్నింగ్స్‌లో అద్భుతాలు సృష్టించడంలో విఫలమయ్యాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసి 25 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ప్రారంభ ఓవర్లలో అర్ష్‌దీప్ వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడిని పెంచడంలో సఫలమయ్యాడు.
సంజు విఫలం
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో సంజూ శాంసన్ విఫలమయ్యాడు. మళ్లీ జోఫ్రా ఆర్చర్‌కే వికెట్ సమర్పించుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్చర్ ఓవర్లోనే శాంసన్ పెవిలియన్‌కు చేరాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శాంసన్(3) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. జట్టుకు గొప్ప ఆరంభం అందించడంలో విఫలమయ్యాడు. ఇది కూడా టీమ్ ఇండియా ఓటమికి ఓ కారణమైందని విశ్లేషకుల మాట.
సూర్యకుమార్ యాదవ్ బ్యాడ్ ఫామ్
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ షో రాజ్‌కోట్ లోనూ కొనసాగింది. మొదటి రెండు టీ20ల్లో స్వల్ప స్కోర్లకే ఔట్ అయిన సూర్య, మూడో టీ20లోనూ నిరాశపరిచాడు. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో 14 పరుగుల వద్ద ఔటై పెవిలియన్ బాట పట్టాడు.