IND VS BAN Second T20 : మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమ్ ఇండియా - బంగ్లాదేశ్ మధ్య బుధవారం (అక్టోబర్ 9) రెండో టీ 20 జరగనుంది. దిల్లీ వేదికగా ఈ రెండో మ్యాచ్ జరగనుంది. అయితే తొలి పోరులో అలవోకగా గెలుపొందిన భారత జట్టు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.
అయితే శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి ముఖ్యమైన ప్లేయర్స్ లేకున్నప్పటికీ తొలి టీ 20లో భారత జట్టు సులభంగానే గెలుపొందింది. కానీ, ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది.
ఎందుకంటే మొదటి టీ20లో శాంసన్ 19 బంతుల్లో 29 పరుగులు మాత్రమే సాధించగా, అభిషేక్ శర్మ 7 బంతుల్లో 16 పరుగులు చేశాడు. రెండో టీ20 మ్యాచులో అభిషేక్ శర్మ, శాంసన్ జోడీ ఆరంభంలోనే దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్ని అందిస్తే తర్వాత క్రీజులోకి దిగే ప్లేయర్స్ స్వేచ్ఛగా ఆడే ఛాన్స్ ఉంటుంది. తద్వారా జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఉంటుంది.
టీమ్ ఇండియా తుది జట్టులో మార్పులు దాదాపుగా ఉండకపోవచ్చని తెలిసింది. యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. రెండో టీ20లోనూ మయాంక్ అదే ఊపు ప్రదర్శిస్తే బంగ్లా బ్యాటర్లు తిప్పలు పడాల్సిందే.