Ind vs Ban 2nd Test 2024 :భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తిగా మారింది. వరుసగా రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, ఎట్టకేలకు నాలుగో రోడు ఆట సాధ్యమైంది. నాలుగో రోజు ఏకంగా 18 వికెట్లు నేలకూలాయి. సోమవారం ఆట ముగిసేసరికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ఇన్నింగ్స్‌లో 26/2 స్కోరుతో ఉంది. క్రీజులో మొమినుల్ హక్ (0), షద్మన్ ఇస్లామ్ (7) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం బంగ్లా 26 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌ను భారత్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (23), యశస్వీ జైస్వాల్ (72) ధనాధన్ ఇన్నింగ్స్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ టెస్టుల్లో పలు అదుదైన రికార్డులు ఖాతాలో వేసుకుంది. టీమ్ఇండియా బ్యాటర్ల దెబ్బకు భారత్ ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ ఇన్నింగ్స్‌లో టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది.
ఇక టీమ్ఇండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (39; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లీ (47; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (68; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించారు. రిషభ్ పంత్ (9) కాస్త నిరాశపర్చాడు. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్ చెరో నాలుగు వికెట్లతో సత్తాచాటారు.