Ind Vs Aus U19 Final :అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఆరోసారి కప్పు ఒడిసిపట్టాలని టీమ్ఇండియా ఉవ్విళ్లూరుతోంది. గతేడాది నవంబర్ 19న భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత అభిమానులను ఆస్ట్రేలియా కన్నీరు పెట్టించింది. అయితే అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు యువ భారత్ సిద్ధమైంది.
ఉదయ్ సహారాన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్, సౌమ్‌కుమార్ పాండేలతో కూడిన బలమైన టీమ్ఇండియాను ఓడించడం కంగారులకు అంత తేలిక కాదు. తాము ప్రతీకారం గురించి కానీ గతం గురించి కానీ ఆలోచించడం లేదని తమ దృష్టంతా తుది సమరంలో గెలుపుపైనే ఉందంటూ భారత సారథి ఉదయ్ సహారన్ ఇటీవలే పేర్కొన్నాడు. ఆసీస్ జట్టులో కెప్టెన్ హ్యూ వీబ్‌జెన్, ఓపెనర్ హ్యారీ డిక్సన్, సీమర్లు టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లర్ నిలకడగా రాణిస్తున్నారు. 2012, 2018ల్లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా జట్టును టీమ్ఇండియా ఓడించింది.
మరోసారి ఆ ఫలితాన్ని యువ జట్టు పునరావృతం చేయాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. 2016, 2018, 2020, 2022, 2024లో అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో భారత యువ జట్టు వరుసగా ఫైనల్స్‌కు చేరింది. 2018, 2022లో ప్రపంచకప్‌ను ఒడిసిపట్టిన టీమ్ఇండియా 2016, 2020లో మాత్రం ఓటమిని చవి చూసింది. 2024లో కూడా విజయం సాధించి వరుసగా రెండోసారి కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని టీమ్ఇండియా భావిస్తోంది.