T20 World cup 2024:2024 టీ20 వరల్డ్ కప్‌లో 2023 వన్డే వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుతుందా? ఐసీసీ ఈవెంట్ ఆస్ట్రేలియా- భారత్ మళ్లీ ఫైనల్లో ఢీకొంటాయా? ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ మాత్రం అదే జరగాలని కోరుకుంటున్నాడు. రెండు టీమ్‌లు సూపర్- 8 స్టేజ్‌ని దాటి మళ్లీ ఐసీసీ ట్రీఫీ కోసం తలపడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ), 2023 వన్డే వరల్డ్‌కప్ రెండు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయింది. రెండుసార్లు ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడం గమనార్హం. తాజాగా బ్రాడ్ హాగ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ఈ సెషన్లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. 'సూపర్ 8లో ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్ (ఇంకా అర్హత సాధించలేదు), ఆఫ్గానిస్థాన్ తలపడుతాయి. ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసీస్, భారత్ సెమీ-ఫైనల్‌కు వెళ్లాలని ఆశిస్తున్నాను. గ్రాండ్ ఫైనల్లో మళ్లీ ఆస్ట్రేలియా- భారత్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది జరగాలని నేను కచ్చితంగా కోరుకుంటున్నాను' అన్నాడు.
భారత్- ఆసీస్ ఫైనల్ ఎలా చేరుతాయి?
సూపర్- 8కి చేరిన టీమ్‌లు గ్రూప్ 1, గ్రూప్ 2గా విడిపోతాయి. రెండు గ్రూపుల్లో టాప్ 2 పొజిషన్స్‌లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కి చేరుతాయి. సెమీఫైనల్ 1లో గ్రూప్ 1లో మొదటి జట్టు, గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉన్న జట్టు ఆడుతాయి. సెమీఫైనల్ 2లో గ్రూప్ 2లోని మొదటి జట్టు, గ్రూప్ 1లోని రెండో జట్టు ఆడుతాయి. గ్రూప్ 1లో భారత్, ఆసీస్, ఆఫ్గానిస్థాన్ ఉన్నాయి. నాలుగో టీమ్ ఇంకా డిక్లేర్ కావాల్సి ఉంది.