IND VS AUS, SA Series Young cricketers In TeamIndia : జట్టును ముందుండి నడిపించిన స్టార్ ప్లేయర్స్, ఎన్నో రికార్డులను, విజయాలను అందించిన మేటి ఆటగాళ్లు, ఆట నుంచి నిష్క్రమించాల్సిన సమయం వస్తే అప్పుడా జట్టు కాస్త ఇబ్బంది పడడం సహజం! గతంలో దిగ్గజాలు ఒక్కొక్కరుగా నిష్క్రమించినప్పుడు భారత జట్టు కొంత కాలం అలానే తడబడింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులు, వన్డేల్లోనూ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అర్థమవుతోంది! జడేజా, అశ్విన్ లాంటి సీనియర్లు కూడా చరమాంక దశలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు యంగ్ ప్లేయర్స్‌పై దృష్టి సారించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం యంగ్ ప్లేయర్స్‌కు అవకాశం ఇచ్చారు. మరి వీరిలో తమదైన ముద్ర వేసి భారత జట్టులో ఎవరు స్థిరపడతారో.
పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ (Nitish Kumar vs Australia)
ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన నితీశ్ కుమార్ 303 పరుగులు, 3 వికెట్లతో అదరగొట్టి, రీసెంట్‌గానే టీమ్‌ఇండియా టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడేమో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.
బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర సిరీస్‌లోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 90 పరుగులు, 3 వికెట్లతో మెప్పించాడు 21 ఏళ్ల ఈ విశాఖ కుర్రాడు. హార్దిక్ పాండ్య సహా ఇతర పేస్ ఆల్‌రౌండర్లు తరచూ గాయాలు పడుతుండటంతో భవిష్యత్ ప్రత్యామ్నాయంగా మారాడు. ఆస్ట్రేలియా టూర్ కోసం సెలక్ట్ చేసిన 18 మంది ప్లేయర్ల భారత జట్టులో నితీశ్ ఒక్కడే పేస్ ఆల్‌రౌండర్.
కాబట్టి ఈ ఆస్ట్రేలియా సిరీస్‌లో నితీశ్‌కు ఆడే ఛాన్స్ వస్తే ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడు కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా-ఎతో సిరీస్ కోసం కూడా భారత్-ఎ తరపున ఆసీస్ గడ్డపై అడుగుపెట్టాడు. అక్టోబర్ 31 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో అక్కడి పిచ్ పరిస్థితులపై నితీశ్‌కు అవగాహన వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు అతడు కెరీర్లో 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 708 పరుగులు చేసి 55 వికెట్లు పడగొట్టాడు.
అభిమన్యు ఈశ్వరన్ ఎంట్రీ (Abhimanyu Eeswaran vs australia)
ఈ పేరు గత కొంత కాలంగా భారత క్రికెట్లో ఎక్కువగానే వినిపిస్తోంది. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2022 బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం అతణ్ని తీసుకున్నా తుదిజట్టులో చోటు దక్కలేదు.
ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో ఓ మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాలతో రోహిత్ దూరమవుతాడని అంటున్నారు. ఆ మ్యాచ్‌లోనే అభిమన్యు ఓపెనర్‌గా బరిలోనే దిగుతాడని అంటున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ బంగాల్ ప్లేయర్ 99 మ్యాచ్‌ల్లో 49.92 యావరేజ్‌తో 7638 పరుగులు చేశాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ శతకాలు బాదాడు. దులీప్ ట్రోఫీలో రెండు శతకాలు, ఇరానీ కప్‌లో 191 పరుగుల ఇన్నింగ్స్, ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు.
140 కిలోమీటర్ల వేగంతో హర్షిత్ రాణా (Harshit rana vs australia)
22 ఏళ్ల దిల్లీ కుర్రాడు హర్షిత్ రాణాది పశ్చిమ దిల్లీ. సెహ్వాగ్, నెహ్రా, ఇషాంత్, గంభీర్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఇక్కడ నుంచే వచ్చారు. హర్షిత్ రాణా పదునైన వేగంతో బంతులు విసిరి వికెట్లు పడగొట్టగలడు. కీలక సమయాల్లో జట్టుకు విజయాలు అందిస్తుంటాడు. ఈ ఏడాది ఐపీఎల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 20.15 యావరేజ్‌తో 19 వికెట్లు తీశాడు.