Jasprit Bumrah IND Vs AUS : ఆస్ట్రేలియా పర్యటనలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అదరగొట్టేస్తున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దూసుకెళ్తున్నాడు. అయితే సిడ్నీ వేదికగా ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆసీస్ గడ్డపై ఒకే సిరీస్‌లో (కనీసం 5 టెస్టులు) ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. స్పిన్ దిగ్గజం దివంగత బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును బుమ్రా అధిగమించాడు.
బిషన్ సింగ్ బేడీ 1977/78 సీజన్‌లో ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడారు. ఆ సిరీస్‌లో ఆయన 31 వికెట్లు పడగొట్టారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కావడం విశేషం. అయితే ఇప్పుడు బుమ్రా 32 వికెట్లతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా వికెట్లను పడగొట్టి బుమ్రా తన ఖాతాలో ఈ ఘనతను వేసుకున్నాడు.
మరోవైపు కొత్త ఏడాదిలో అత్యధిక బౌలింగ్ రేటింగ్ సాధించిన టీమ్ఇండియా బౌలర్‌గా ఇప్పటికే బుమ్రా టాప్లో ఉన్నాడు. అంతేకాకుడా గతేడాది 13 టెస్టుల్లో 71 వికెట్లు తీసిన బుమ్రా టాప్ వికెట్ టేకర్ కూడా కావడం విశేషం.