ICC Ranking 2024 :అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ రీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై బాదిన శతకంతో పంత్ ఏకంగా టాప్ 10లోకి దూసుకొచ్చాడు. పంత్ ప్రస్తుతం 731 రేటింగ్స్‌తో ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఇక బంగ్లాపై హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న యశస్వీ జైస్వాల్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 751 రేటింగ్స్‌తో ఐదో స్థానానికి ఎగబాకాడు. అదే టెస్టులో సెంచరీతో రాణించిన శుభ్‌మన్ గిల్ 5 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ప్లేస్ (701 రేటింగ్స్) దక్కించుకున్నాడు.
5 స్థానాలు కోల్పోయిన రోహిత్, విరాట్
కాగా, బంగ్లాతో టెస్టులో విఫలమైన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇద్దరు చెరో 5 స్థానాలు కోల్పోయారు. ప్రస్తుతం రోహిత్ (716 రేటింగ్స్) పదో ప్లేస్‌కు పడిపోయాడు. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 6, 5 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. దీంతో రోహిత్ ఐదు నుంచి పదో ప్లేస్‌కు పడిపోయాడు.
టాప్-10 నుంచి డ్రాప్
అలాగే బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 17 పరుగులకే విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో టాప్ 10లో చోటు కోల్పోయాడు. ఏకంగా ఐదు స్థానాలు కోల్పోయిన విరాట్ (709 రేటింగ్స్) 12వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 899 రేటింగ్స్‌తో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
జో రూట్ | ఇంగ్లాండ్ | 899 రేటింగ్స్ |
కేన్ విలియమ్సన్ | న్యూజిలాండ్ | 852 రేటింగ్స్ |
డారిల్ మిచెల్ | న్యూజిలాండ్ | 760 రేటింగ్స్ |
స్టీవ్ స్మిత్ | ఆస్ట్రేలియా | 757 రేటింగ్స్ |
యశస్వీ జైస్వాల్ | భారత్ | 751 రేటింగ్స్ |