Jay Shah Net Worth:బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా, తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఈ అత్యున్నత పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా (35) జై షా చరిత్రకెక్కనున్నారు. ఈ క్రమంలో జై షా ఆస్తులు, సంపదపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. మరి జైషా ఆస్తులు ఎంతో తెలుసా?
కోట్లు విలువైన ఆస్తి!
జై షాకు వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరు. అలాగే బీసీసీఐ నుంచి జై షాకు అలవెన్సులు, స్టైఫెండ్ వస్తుంది. అలా విదేశీ పర్యటనలు, సమావేశాలకు బీసీసీఐ రోజుకు రూ.82వేలు చెల్లిస్తుంది. ఇక కుసుమ్ ఫిన్‌సెర్వ్ (Kusum Finserv) లో జై షాకు 60 శాతం వాటా ఉంది. ఇలా పలు వ్యాపారాల్లోనూ జై షా పెట్టుబడులు పెట్టారు. అలాగే బీసీసీఐలో అత్యన్నత పదవిలో ఉండడం వల్ల ఆయన నెట్వర్త్పై ఇవన్నింటితో కలిపి జై షా ఆస్తి రూ.124 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పై పట్టు
జై షాకు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పై మంచి పట్టు ఉంది. అందుకే చిన్న వయసులోనే బీసీసీఐ సెక్రటరీగా, ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్ (CBCA) మెంబర్‌గా మొదలైన జైషా ప్రస్థానం, తాజాగా ఐసీసీలో టాప్ పొజిషన్ వరకు చేరింది. దీంతో జైషాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.