Siraj Head Fight :అడిలైడ్ పింక్ బాల్ టెస్టు సందర్భంగా టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ సిరాజ్- ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన మాటల యుద్ధం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వీరిద్దరి ప్రవర్తనను ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే వీరిపై ఐసీసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
ఆటగాళ్లిద్దరూ క్రమశిక్షణా నియామవళి ఉల్లంఘించారని భావిస్తున్న ఐసీసీ, వీరిని మందలించి జరిమానా విధించే ఛాన్స్ ఉన్నట్లు ఆస్ట్రేలియా మీడియా వెబ్సైట్లు తమ కథనాల్లో పేర్కొన్నాయి. అయితే ఐసీసీ క్రమశిక్షణా నియమావళిని వీరు పూర్తిగా ఉల్లంఘించకపోవడం వల్ల సస్పెన్షన్ విధించే ఛాన్స్ లేకపోవచ్చు. ఇక ఈ వ్యవహారంపై ఐసీసీ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ జరిగింది
భారత్- ఆసీస్ రెండో టెస్టు రెండో రోజు ట్రావిస్ హెడ్‌ను 140 వ్యక్తిగత పరగుల వద్ద సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సమయంలో సిరాజ్ సంబరాలు చేసుకుంటుండగా, హెడ్ తన వైపు చూస్తూ ఏదో అన్నట్లు కనిపించింది. దీంతో సిరాజ్ పట్టరాని కోపంతో 'వెళ్లవయ్యా వెళ్లు' అన్నట్లు సైగ చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరలైంది. సిరాజ్ అలా ప్రవర్తించి ఉండకూడదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు.