ICC Hall Of Fame 2024 :భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అత్యున్నత గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2024లో నీతూ డేవిడ్‌కు చోటు దక్కింది. ఆమెతో పాటు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. ఈ ముగ్గురు క్రికెటర్లను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ సందర్భంగా 2024 సంవత్సరానికిగాను ఆల్ హాఫ్ ఫేమ్‌ను ఐసీసీ ప్రకటించింది.
కాగా, క్రికెట్‌లో లెజెండరీ ప్లేయర్లకు గుర్తింపుగా 2009లో ఐసీసీ ఈ ఆల్ హాఫ్ ఫేమ్‌ను తీసుకొచ్చింది. అప్పట్నుంచి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెజెండరీ క్రికెటర్లకు ఇందులో చోటు కల్పించి ఐసీసీ ఇలా గౌరవిస్తోంది. ఇక ఇందులో స్థానం దక్కించుకున్న జాబితాలో కుక్ది 113వ నెంబర్ కాగా, నీతూ డేవిడ్ 114వ, డివిలియర్స్ 115 ప్లేస్ దక్కించుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 1995- 2008 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 97 వన్డేలు ఆడిన ఆమె 141 వికెట్లు పడగొట్టింది. 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 41 వికెట్లు సాధించింది. భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్ ఈమెనే కావడం విశేషం. నీతూ కెరీర్ ఆరంభంలోనే సంచలన ప్రదర్శన చేసింది. 1995లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 8/53తో ఆకట్టుకుంది. ఇది మహిళల టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచిపోయింది. ప్రస్తుతం నీతూ డేవిడ్ మహిళల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతోంది.
కుక్ గణాంకాలు
- 161 టెస్టులు- 12,472 పరుగులు
- 92 వన్డేలు- 3204 పరుగులు
- 4 టీ20లు- 61 పరుగులు
డివిలియర్స్ గణాంకాలు
- 114 టెస్టులు- 8765 పరుగులు : 222 క్యాచ్‌లు, 5 స్టంపింగ్స్
- 228 వన్డేలు- 9577 పరుగులు : 176 క్యాచ్‌లు, 5 స్టంపింగ్స్
- 78 టీ20లు- 1672 పరుగులు : 65 క్యాచ్‌లు, 7 స్టంపింగ్స్