Akash Chopra On ICC Champions Trophy 2025 :భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. భారత ఆడకపోతే ఆదాయం భారీగా పడిపోతుందని వ్యాఖ్యానించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు పాకిస్థాన్‌కు రాలేమని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆకాస్ చోప్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
'టోర్నీ రద్దయ్యే అవకాశాలు'
"భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు. పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోవడం వల్ల ఆర్థికపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో టోర్నమెంట్ పూర్తిగా రద్దు కూడా అవ్వొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఒక ఐసీసీ ఈవెంట్. ప్రసారకర్తలు ఈ ఈవెంట్ కోసం భారీ మొత్తంలో డబ్బును ఖర్చుపెడతారు. అయితే ఈ టోర్నీల్లో భారత్ పాల్గొనకుంటే ప్రసారకర్తలు పెట్టుబడులు పెట్టరు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. భారత్ ఆడకపోతే ఆదాయం భారీగా పడిపోతుంది. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదని భావిస్తున్నాను. పాకిస్థాన్ సహా ప్రతి జట్టుకు ఈ విషయం తెలుసు." అని ఆకాశ్ తన యూట్యూబ్ ఛానల్లో వ్యాఖ్యానించాడు.
యూఏఈలో జరిగే అవకాశం!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో జరిగే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. టోర్నో కోసం పాకిస్థాన్‌కు భారత్ రాకపోతే అది జరగదని పీసీబీకి కూడా తెలుసని అన్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాడు. "గత పీసీబీ చీఫ్ 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో 'మేం శత్రు దేశ భూభాగంలోకి వెళ్తున్నాం. భవిష్యత్‌లో పాకిస్థాన్ భారత్‌తో ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పాక్‌లో పర్యటించకపోతే భారత్‌కు కూడా ఇబ్బందులు తప్పవు' అన్నారు. కానీ, ఆంక్షలు ఆర్థికంగా ఉంటాయి. భారతదేశం డబ్బుని భారత్‌కు వెళ్లడాన్ని ఐసీసీ ఎలా ఆపగలదు? పాకిస్థాన్ కు అలాంటి పరపతి లేదు. ఇది కఠినమైన వాస్తవం" అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.