Harshit Rana Champions Trophy 2025 : ఇంగ్లాండ్‌తో తాజాగా జరిగిన సిరీస్‌లోనే వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు యంగ్ బౌలర్ హర్షిత్ రాణా. తొలి ఆటలోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి అదరగొట్టాడు. దీంతో బుమ్రా స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో హర్షిత్ ఎంపిక చేసుకుంది మేనేజ్మెంట్. ఈ క్రమంలో అతడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో కలిసి కొత్త బంతిని పంచుకోవాల్సి ఉంటుంది. అయితే, అతడు పాత బంతితో ప్రమాదకరంగా అనిపిస్తాడని, మొదటి స్పెల్‌లో మాత్రమే భారీగా పరుగులు ఇస్తున్నట్లు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. అలాగే బుమ్రా ప్లేస్‌ను భర్తీ చేయడమనేది తేలికైన విషయం కాదని చెప్పుకొచ్చాడు.
"కొత్త బంతితో హర్షిత్ బాగా పరుగులు ఇస్తున్నాడు. ఓపెనింగ్ స్పెల్‌లో కాస్త భిన్నమైన బౌలర్‌గానే అతడు కనిపిస్తున్నాడు. అయితే అతడు స్వింగ్ బౌలర్ కాదు. పిచ్‌పై బలంగా బంతిని విసిరే బౌలర్. అందుకే, బంతి పాతబడిన తర్వాతనే వికెట్లు తీయడం తనకు సులువైన పని . హార్దిక్ పాండ్యతోనూ మొదటి వన్డేలో కొత్త బంతితోనే బౌలింగ్ చేయించారు. అయితే రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే పని చేస్తారా? అంటే కచ్చితంగా చెప్పలేం. రెండు లేదా మూడు ఓవర్లను నాణ్యంగా వేస్తేనే తనను కొనసాగించే అవకాశం ఉంటుంది. బుమ్రా ప్లేస్‌ను రాణాతో భర్తీ చేయడమనేది చాలా కష్టమైన పని. కొత్త బంతితో రాణా ఎక్కువగా వికెట్లు తీయలేదు. అయితే, ఈ కేటగిరిలో అతడు కాస్త మెరుగైతే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో హర్షిత్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కష్టం అనే చెప్పాలి" అని పార్థివ్ పేర్కొన్నాడు.