Gurbaz Comments On Rinku: 26 ఏళ్ల రింకూ సింగ్ ప్రస్తుతం టీ20ల్లో అదరగొడుతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడుగా ఆడుతూ ఎడాపెడా బౌండరీలు బాదుతున్నాడు. అయితే రీసెంట్గా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లోనూ రోహిత్ శర్మతో కలిసి రింకూ అద్భుత (190*) భాగస్వామ్యం నిర్మించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 39 బంతుల్లోనే 69 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు.
అయితే కొంతకాలంగా మిడిల్ ఆర్డర్లో రావడమే కాకుండా పలు మ్యాచ్‌లను అద్భుతంగా ముగించి, ఇప్పుడిప్పుడే టీమ్ఇండియాలో రింకూ నయా ఫినిషర్‌గా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో రింకూ ఐపీఎల్ టీమ్మేట్ (కేకేఆర్) రహ్మనుల్లా గుర్బాజ్ రీసెంట్గా అతడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రింకూ హార్డ్ వర్కింగ్ అంటూ ప్రశంసింస్తూ, అతడిని ఎమ్ఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‌తో పోల్చాడు.
ఇటీవల ఓ స్పోర్ట్ ఛానెల్‌తో మాట్లాడిన గుర్బాజ్‌కు 'రింకూ టీమ్ఇండియాలో ధోనీ, యువరాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తాడా'? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో 'వ్యక్తిత్వంగా రింకూ ఫన్నీ పర్సన్. అందర్నీ నవ్విస్తుంటాడు. నేను రింకూను చాలా ఇష్టపడతా. ఐపీఎల్ వల్ల మా మధ్య మంచి బాండింగ్ ఉంది. ప్రస్తుతం రింకూ కెరీర్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా టీమ్ఇండియా ఆడిన అన్ని సిరీస్‌ల్లోనూ అతడి ప్రదర్శన అద్భుతం. గ్రౌండ్లో అది కనిపిస్తూనే ఉంది. అతడు క్రీజులో ఉన్నప్పుడు బంతినే గమనిస్తాడు. ఏ దేశంలో ఆడిన అక్కడి పరిస్థితులను తొందరగా అలవాటు చేసుకుంటాడు. అతడు మంచి క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీమ్ఇండియాకు భవిష్యత్ ఫినిషర్ రింకూనే' అని గుర్బాజ్ అన్నాడు.